తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా సాగుతోంది. కార్మికులు వెనక్కితగ్గేది లేదంటున్నారు. ఇటు కేసీఆర్ కూడా అంతే పంతంగా ఉన్నారు. అంతే కాదు కనీసం సెప్టెంబర్ జీతాలు కూడా ఇవ్వనంటున్నారు. ఇలాంటి నేపథ్యలో కేసీఆర్ ఆర్టీసీకి డెడ్ లైన్ పెట్టారు. మూడంటే మూడు రోజుల్లో వందకు వంద శాతం ఆర్టీసీ బస్సులు నడిచి తీరాలని, ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.


చట్ట విరుద్ధంగా జరుగుతున్న సమ్మెను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించదని, సమ్మె చేస్తున్న వారితో చర్చలు కూడా జరపదని సిఎం స్పష్టం చేశారు. తమంతట తాముగా అనధికారికంగా విధులకు గైర్హాజరైన వారిని తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకునే ప్రసక్తే లేదని సిఎం ప్రకటించారు. సమ్మెలో పాల్గొనకుండా విధులు నిర్వర్తిస్తున్న వారికి సంబంధించిన సెప్టెంబర్ మాసం జీతాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు.


50 శాతం ఆర్టీసీ బస్సులు నడపడానికి అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాలని, 30 శాతం బస్సులను అద్దె ప్రాతిపదికన, 20 శాతం ప్రైవేటు బస్సులకు స్టేజీ క్యారేజీలుగా రూట్ పర్మిట్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బస్సులు వందకు వంద శాతం పునరుద్ధరించడానికి కొద్ది రోజులు పట్టే అవకాశం ఉండడంతో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు దసరా సెలవులను ఈ నెల 19 వరకు పొడిగిస్తున్నట్లు సిఎం ప్రకటించారు.


ఆర్టీసీ సమ్మె వల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, సీనియర్ అధికారులు సునిల్ శర్మ, నర్సింగ్ రావు, సందీప్ సుల్తానియా, ట్రాన్స్ పోర్టు జాయింట్ కమిషనర్లు పాండురంగ నాయక్, సి.రమేశ్, మమతా ప్రసాద్, డిటిసిలు ప్రవీణ్ రావు, పాపారావు, ఆర్టీసీ ఇ.డి.లు టివి రావు, యాదగిరి, వినోద్, వెంకటేశ్వర్లు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: