ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇటీవల విశాఖ జిల్లాలో పర్యటించారు. అక్కడి పార్టీ పరిస్థితిని సమీక్షించారు. పార్టీ నేతలతో రాజకీయ పరిస్థితులపై సమాలోచనలు జరిపారు. తాను సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రం ఎంత బావుండేదో.. ఇప్పుడు ఎంత అధ్వాన్నంగా తయారైందో కార్యకర్తలకు వివరించారు.


అయితే చంద్రబాబు ఆరోజు విశాఖలో ప్రసంగిస్తున్న సమయంలో నాలుగైదు సార్లు కరంట్ పోయింది. ఇలాంటి విషయాలను కూడా రాజకీయాలకు వాడుకోవడంలో చంద్రబాబుది అందె వేసిన చేయి కదా.. ఇంకేం.. చూశారా తమ్ముళ్లు వీళ్లు కరంటు కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు అంటూ వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. అంతే కాదు.. ఇసుక విషయంలోనూ జగన్ సర్కారు పనితీరుదారుణగా ఉందన్నారు.


రావాలి కరంట్.. కావాలి ఇసుక.. అంటూ జనం నినాదాలు చేస్తున్నారని చంద్రబాబు జగన్ పై సెటైర్లు కూడా వేశారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు చంద్రబాబు తీరుపై విమర్శలు గుప్పించారు. అసలు చంద్రబాబు ఆ రోజు ప్రసంగిస్తున్నప్పుడు ఏం జరిగిందో వివరించారు.


విశాఖ తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా కరెంటు పోవడం పైనా తి శ్రీనివాస్ స్పందించారు. ఆ రోజు కాకి తగిలి రెండు సార్లు కరెంటు పోయిందని వివరించారు. అంతే కాదు.. కాకి తగిలినందువల్ల టీడీపీ ఆఫీసులో ప్యూజు పోయిందన్నారు. రెండు సెకన్లు కరెంటు లేకపోతేనే చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారని అవంతి ఎద్దేవా చేశారు.


ఇసుక దోపిడీపైనా చంద్రబాబు చర్చకు రావాలని మంత్రి అవంతి శ్రీనివాసరావు సవాలు విసిరారు. ముఖ్యమంత్రిని రోజూ తిడితే సానుభూతి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారని ఆయన విశాఖలో అన్నారు. ఇసుక విధానం తీసుకురావాలని ప్రభుత్వం భావించిన తరువాత వరదలు, వర్షాలు వచ్చాయన్నారు. అయినప్పటికీ ఈ మూడు నెలలు సీజన్ కానందున ఇబ్బంది లేదనే అభిప్రాయాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: