ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ, వార్డు వాలంటీర్ల ఉద్యోగాల నియామకం చేపట్టిన విషయం తెలిసిందే. కానీ గ్రామ, వార్డు వాలంటీర్లుగా ఎంపికయిన వారు కొందరు ఆ తరువాత వివిధ కారణాలతో వాలంటీర్ల ఉద్యోగాలలో చేరలేదు. అలా వివిధ కారణాలతో భర్తీ కాని, ఎంపికయినా చేరని 9,648 వాలంటీర్ల నియామకం కోసం ప్రభుత్వం మరోసారి ప్రకటన చేయనుంది. 
 
ప్రస్తుతం అధికారులు రాష్ట్రవ్యాప్తంగా భర్తీ కాని గ్రామ, వార్డు వాలంటీర్ల పోస్టుల వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ, వార్డు వాలంటీర్ చొప్పున 1,94,592 మంది గ్రామ, వార్డు వాలంటీర్ల నియామకం చేపట్టింది. 1,84,944 మంది గ్రామ, వార్డు వాలంటీర్లు రాష్ట్రంలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 9,648 వాలంటీర్ల నియామకం కోసం ప్రభుత్వం ఈ నెలాఖరులోగా ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
ప్రభుత్వం ప్రకటన జారీ చేసిన తరువాత డిసెంబర్ నెలలోగా ఈ పోస్టుల భర్తీ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. కడప జిల్లాలో 891, విజయనగరం జిల్లాలో 823, పశ్చిమ గోదావరి జిల్లాలో 590, శ్రీకాకుళం జిల్లాలో 200, ప్రకాశం జిల్లాలో 592, నెల్లూరు జిల్లాలో 340, విశాఖపట్నం జిల్లాలో 370, అనంతపురం జిల్లాలో 955, చిత్తూరు జిల్లాలో 678, తూర్పు గోదావరి జిల్లాలో 1,861, కర్నూలు జిల్లాలో 976, కృష్ణా జిల్లాలో 453, గుంటూరు జిల్లాలో 919 వాలంటీర్ల ఖాళీలు భర్తీ కావాల్సి ఉంది. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో ఎంపికైన గ్రామ, వార్డు వాలంటీర్లు వారికి కేటాయించిన విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీర్లకు 5,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తోంది. ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీర్ల జీతాలు పెంచుతున్నట్లు కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చినా ఆ వార్తల గురించి అధికారికంగా ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రకటన మాత్రం రాలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: