ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం క‌శ్మీర్‌లో ప‌రిస్థితులు మారిపోయిన సంగ‌తి తెలిసిందే. క‌శ్మీర్‌కు ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తి నిర్ణ‌యం ఉప‌సంహ‌రించుకుంటున్న స‌మ‌యంలో.... పరిస్థితుల అదుపు త‌ప్ప‌కుండా ప్రభుత్వం మొబైల్‌ సేవలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. 69 రోజుల తర్వాత కేంద్రం ఈ నిషేదాజ్ఞలు ఎత్తివేస్తుంది. పోస్ట్ పెయిడ్‌ అన్ని మొబైల్‌ సేవలు కశ్మీర్‌లో సోమవారం నుంచి తిరిగి ప్రారంభంకానున్నాయి. కాగా ఇంటర్నెట్‌ సేవల పునరుద్ధరణకు మాత్రం మరికొంత సమయం పడనున్నట్లు సమాచారం. 


ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు నేప‌థ్యంలో క‌శ్మీర్ నుంచి ప‌ర్యాట‌కుల‌ను హుటాహుటిన వెళ్లగొట్టిన విష‌యం తెలిసిందే. అయితే ప‌ర్యాట‌కుల రాక‌పై ఉన్న నిషేధాన్ని ఉప‌సంహ‌రిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొంది.  రెండు నెల‌ల నిషేధం త‌ర్వాత జ‌మ్మూక‌శ్మీర్ ప్ర‌భుత్వం మ‌ళ్లీ ప‌ర్యాట‌కుల‌ను ఆహ్వానిస్తున్న‌ది. క‌శ్మీర్ లోయ‌కు వ‌చ్చే ప్ర‌తి యాత్రికుడికి కావాల్సిన స‌హాయాన్ని అందివ్వాల్సిందిగా ప్ర‌భుత్వం త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ట్రావ‌ల్ అడ్వైజ‌రీని ఎత్తివేయాల‌ని కోరుతూ గ‌వ‌ర్న‌ర్ ఆదేశాలు జారీ చేశారు. ఆగ‌స్టు నెల‌లో ట్రావ‌ల్ అడ్వైజ‌రీ అమ‌ల్లోకి వ‌చ్చింది. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత టెలిఫోన్‌, ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను నిలిపేశారు. కాగా, తాజా నిర్ణ‌యంతో కశ్మీర్‌ సందర్శనకు పర్యాటకులకు కేంద్రం ద్వారాలు తెరవడంతో స్థానిక ట్రావెల్‌ అసోషియేషన్‌ సంస్థలు అధికారులను ఆశ్రయించి విజ్ఞప్తి చేశారు. మొబైల్‌ ఫోన్స్‌ పనిచేయకపోతే పర్యాటకులెవరూ కశ్మీర్‌ లోయను సందర్శించేందుకు రారని పేర్కొన్నారు.


క‌శ్మీర్‌కు ప్ర‌ధాన ఆర్థిక వ‌న‌రు టూరిజం. అయితే యాత్రికుల‌పై నిషేధం ఉన్న కార‌ణంగా.. అక్క‌డ టూరిజం దెబ్బ‌తింది. గ‌త జూన్‌లో సుమారు 1.74 ల‌క్ష‌ల మంది టూరిస్టులు క‌శ్మీర్‌కు వచ్చారు. జూలైలో 1.52 ల‌క్ష‌ల మంది వెళ్లారు. కాగా, టెలీఫోన్ సేవ‌లు అందుబాటులోకి తేవ‌డంలోనూ కీల‌క ప‌ర‌ణామాలు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి పోస్ట్‌ పేయిడ్‌ మొబైల్‌ సేవలు శ‌నివారం నుంచే ప్రారంభం కావాల్సి ఉండగా సాంకేతిక సమస్యల కారణంగా సోమవారానికి వాయిదా వేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: