ప‌క్క రాష్ట్రమైన క‌ర్ణాట‌క‌లో ఓ భారీ స్కాం బ‌య‌ట‌ప‌డింది. రూ. 100 కోట్ల మెడికల్ స్కాం(వైద్యవిద్య ప్రవేశాల కుంభకోణం) వెలుగుచూసింది. విద్యార్థుల ఆస‌క్తి, త‌ల్లిదండ్రుల ఆస‌క్తిని సొంతం చేసుకునే క్ర‌మంలో ఒక్కో మెడిసిన్‌ సీటుకు రూ. 65 లక్షలు చొప్పున వసూలు చేస్తూ అక్రమంగా సీట్లను అమ్ముకున్న పలు కాలేజీల గుట్టును ఆదాయపు పన్ను(ఐటీ)శాఖ అధికారులు రట్టు చేశారు. ఎంసీసీ(మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ) మెరిట్ ప్రాతిపదికన కేటాయించిన సీట్లు నిబంధనలకు విరుద్ధంగా మేనేజ్ మెంట్ కోటా(ఇనిస్టిట్యూషనల్ కోటా)కిందకు మారాయి. దీని కోసం డ్రాపవుట్ వ్యవస్థను ఉపయోగించారు అని ఐటీ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.


సంచ‌ల‌న‌మైన ఈ స్కాంలో నిబంధ‌న‌ల‌ను ఓ రేంజ్‌లో వాడుకున్నార‌ని ఐటీ సోదాల్లో పాల్గొన్న ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. స్కాం జరిగిన తీరును ఓ జాతీయ వార్తా చానల్‌కు వివరిస్తూ...డ్రాపవుట్ వ్యవస్థను ఉపయోగించారు అని  పేర్కొన్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)ను ప్రభుత్వం నిర్వహిస్తుంది.అయితే, అప్పటికే నీట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి వేరే కళాశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు(ఈ పని చేసినందుకు వీళ్లకు డబ్బు ముట్టజెప్పారు) ఈ స్కాంలో భాగంగా మళ్లీ నీట్ పరీక్షను రాస్తారు. నీట్‌లో తిరిగి అర్హతను సాధించి తాజాగా ఈ స్కాం వెలుగు చూసిన కాలేజీల్లో ప్రవేశం పొందుతారు. కౌన్సెలింగ్ ముగిసే వరకు సీట్లను బ్లాక్(నిలిపి వేయడం) చేయడానికే వాళ్లు ఈ అడ్మిషన్స్ తీసుకొని.. ఆ తర్వాత తమ సీట్లను రద్దు చేసుకుంటారు. దీంతో కన్వీనర్ కోటా కింద ఉన్న సదరు సీట్లు ఆఖరి నిమిషంలో మేనేజ్ మెంట్ కోటా సీట్లుగా మారుతాయి. అప్పుడు సదరు కాలేజీలు తమకు ఇష్టం వచ్చినట్టు ఆయా సీట్లను అమ్ముకుంటాయి. ఇలా ఒక్కో సీటుకు రూ. 65 లక్షల చొప్పున యాజమాన్యాలు వసూలు చేస్తాయి.


ఇలా మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో అక్రమాలు జరిగాయన్న నిఘా వర్గాల నివేదికలను ఆధారంగా చేసుకొని ఐటీ శాఖ కర్ణాటక, రాజస్థాన్‌లోని 32 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. వీటిలో భాగంగా కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత జి.పరమేశ్వరకు చెందిన శ్రీ సిద్ధార్థ మెడికల్ కాలేజీ, శ్రీ సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్‌తో పాటు మరో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ ఆర్‌ఎల్ జాలప్పకు చెందిన శ్రీ దేవరాజ్ ఉర్స్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఆర్‌ఎల్ జాలప్ప దవాఖాన ఆండ్ రీసెర్చ్ సెంటర్‌పై కూడా దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయా కాలేజీల్లో అక్రమంగా ప్రవేశాలు జరిగినట్టు గుర్తించామని ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. ఎంసీసీ(మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ) మెరిట్ ప్రాతిపదికన కేటాయించిన సీట్లు నిబంధనలకు విరుద్ధంగా మేనేజ్ మెంట్ కోటా(ఇనిస్టిట్యూషనల్ కోటా)కిందకు మారాయని నిర్ధారించాయి. 


కాగా, సీట్లను అమ్మే ప్రక్రియను ఏజెంట్లు, లావాదేవీలను బ్రోకర్లు చూసేవారని ఐటీ శాఖ పేర్కొంది. స్కాం జరిగిన తీరును వివరిస్తూ సీట్ల మార్పిడిలో సాయపడిన పలువురు విద్యార్థులు తమ వాంగ్మూలాలను కూడా ఇచ్చారని తెలిపింది. దాదాపు 185 సీట్ల కోసం రూ. 100 కోట్లకు పైగా(ఒక్కో సీటుకు రూ. 50 లక్షల నుంచి రూ. 65 లక్షలు) డొనేషన్‌ల రూపంలో వసూలు చేశారని ఐటీ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. స్కాంకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నాం. వీటి ఆధారంగా తయారు చేసిన నివేదికను సీబీడీటీ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్), ఆ తర్వాత సీబీఐ వంటి ఏజెన్సీలకు తదుపరి దర్యాప్తు కోసం పంపుతామ‌ని అధికారులు తెలియజేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: