కీల‌క‌మైన మ‌హారాష్ట్ర ఎన్నిక‌లు స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తున్న‌సంగ‌తి తెలిసిందే. అధికారంలో కొన‌సాగుతూ..తిరిగి అధికారం సొంతం చేసుకోవ‌డం ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్న శివ‌సేన తాజాగా త‌న మేనిఫెస్టో విడుద‌ల చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.10కే ఆరోగ్యకరమైన భోజనాన్ని అందజేస్తామని, ఒక్క రూపాయికే ఆరోగ్య పరీక్షలు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. మహారాష్ట్రలో రూ.10కే భోజనాన్ని అందజేస్తామని శివసేన తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (ఎన్సీపీ) శరద్‌పవార్ విమర్శలు గుప్పించారు.


పేద రైతులకు ఏడాదికి రూ.10,000 చొప్పున నగదు బదిలీ చేస్తామని  మేనిఫెస్టోలో శివసేన వెల్లడించింది. 10, 12వ తరగతి చదివే విద్యార్థులు మరాఠీ భాషలో 80 శాతానికిపైగా మార్కులు సాధిస్తే ప్రత్యేక స్కాలర్‌షిప్‌లను అందజేస్తామని ప్రకటించింది. 300 యూనిట్ల లోపు కరెంటును వినియోగించే వారి బిల్లును 30శాతం తగ్గిస్తామని శివసేన హామీనిచ్చింది. ముంబై మెట్రో రైలు కార్పొరేషన్ అవసరాల నిమిత్తం ఆరే మిల్క్ కాలనీలో భారీగా చెట్ల నరికివేతను తాము వ్యతిరేకిస్తున్నామని ప్ర‌క‌టించింది.


అయితే, శివ‌సేన మేనిఫెస్టోపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (ఎన్సీపీ) శరద్‌పవార్ భ‌గ్గుమ‌న్నారు. షోలాపూర్ జిల్లాలో ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ...రెండు శివ‌సేన‌పై విరుచుకుప‌డ్డారు. ``1990లో రాష్ట్రంలో తొలిసారిగా శివసేన-బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అప్పట్లో జుంకా-భకర్ (గ్రామీణ వంటకమైన రొట్టె, కూర్మ)ను అమ్మే కేంద్రాలను ఏర్పాటు చేశారు. తర్వాత వాటిని ఎత్తివేశారు. మళ్లీ ఇప్పుడు అలాంటి నాటకానికి శివసేన తెరలేపింది. రూ.10కే భోజనాన్ని అందజేస్తామని చెబుతున్నది. వాళ్లు ఒకవేళ అధికారంలోకి వస్తే ప్రభుత్వాన్ని నడుపుతారా? లేక వంటశాలను నడుపుతారా?`` అని నిలదీశారు.  కాగా రాబోయే ఎన్నిక‌ల్లో శివ‌సేన నేత సీఎం పీఠంపై కూర్చోనున్నార‌ని ఆ పార్టీ నేత‌లు ఇప్ప‌టికే ప్ర‌క‌టిస్తున్న స‌మ‌యంలో...మ‌రాఠాల నేత అయిన ప‌వార్  ఈ కామెంట్లు చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: