రాజ‌కీయాల్లో చోటుచేసుకునే అనేక ఆస‌క్తిక‌ర‌మైన, ఇంకా చెప్పాలంటే అనూహ్య‌మైన ఘ‌ట్టాల‌కు ఓ తార్కాణం ఇది. 5 సంవ‌త్స‌రాల కాలంలోనే సొంత పార్టీ నుంచి మ‌రో పార్టీలో చేరి తిరిగి అదే పార్టీలో చేరాను. ఆమె ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) మాజీ ఎమ్మెల్యే అల్కా లాంబా. 2014లో కాంగ్రెస్‌ను వీడిన లాంబా ఆప్‌లో చేరింది. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఆమె కాంగ్రెస్‌ గూటికి చేరింది. న్యూఢిల్లీలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఢిల్లీ యూనిట్‌ ఇన్‌ఛార్జ్‌ పీసీ చాకో సమక్షంలో ఆమె కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలోని చాందినీ చౌక్‌ నియోజకవర్గం నుంచి ఆమె ప్రాతినిధ్యం వహించారు. ఆప్‌లో చేరే కంటే ముందు అల్కా లంబా కాంగ్రెస్‌ పార్టీలో 20 ఏళ్ల పాటు కొనసాగారు.   


ఇందిరాగాంధీ హత్యానంతర సిక్కులు సామూహిక హత్యలను మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ సమర్థించారని..రాజీవ్‌గాంధీకి ప్రభుత్వం ఇచ్చిన భారత రత్న అవార్డును వెనక్కు తీసుకోవాలని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్ర‌భుత్వం చేసిన‌ ప్రతిపాదనను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. తీర్మానంపై విమర్శలు రావడంతో ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్‌ ఓటమికి బాధ్యత తీసుకోవాలని సీఎం కేజ్రీవాల్‌ను అల్కా బాహాటంగా కోరడంతో పార్టీ ఎమ్మెల్యేల అధికారిక వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి ఆమెను తొలగించారు. అనంతరం లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఢిల్లీలో ప్రచారం చేయడానికి కూడా ఆమె రాలేదు. చాలాసార్లు ప్రభుత్వ, పార్టీ నిర్ణయాలపై రెబల్‌ ఎమ్మెల్యే లాంబా అభ్యంతరాలు చెబుతూ వచ్చింది. చివరికి గత సెప్టెంబర్‌లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అసెంబ్లీ స్పీకర్‌ రామ్‌ నివాస్‌ గోయెల్‌ ఆమెపై అనర్హత వేటు వేశారు. గత నెలలోనే ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి చేశారు.


స్పీకర్‌ ఆమెపై అనర్హత వేటు వేయడంతో ప్రస్తుతం  ఢిల్లీలోని చాందినీ చౌక్‌ నియోజకవర్గ స్థానం ఖాళీగా ఉంది. స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పిన లాంబా ఆఖరికి కాంగ్రెస్‌ గూటికి చేరారు. వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటికే ఆయా పార్టీలు ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకుంటున్నాయి. ఇదిలాఉండ‌గా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ చాందినీ చౌక్‌ నియోజకవర్గం నుంచే అల్కా లంబా పోటీ చేస్తారని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: