గ్రామ వాలంటీర్లు.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మదిలో నుంచి పుట్టిన ఆలోచన ఇది. ప్రజలకు ప్రభుత్వ సేవలు నూటికి నూరు శాతం అందాలన్న లక్ష్యంకో ఈ వ్యవస్థను జగన్ రూపొందించారు. దాదాపు రాష్ట్రంలో 2 లక్షల మంది గ్రామ వాలంటీర్లను నియమించారు. గ్రామంలోని ప్రతి 50 కుటుంబాలకు ఓ గ్రామ వాలంటీరు ఉంటారు. అయితే కొన్ని నెలల క్రితం నియమించిన ఈ ప్రక్రియలో వివిధ కారణాల కారణంగా 9,648 పోస్టులు మిగిలిపోయాయి.


మొన్న భర్తీ కాకుండా మిగిలిపోయిన ఈ పోస్టులను కూడా త్వరలో భర్తీ చేయాలని నిర్ణయించింది. వివిధ కారణాలతో భర్తీ కాని 9,648 గ్రామ వాలంటీర్ల నియామకం కోసం ప్రభుత్వం మరోసారి ప్రకటన జారీ చేయనుంది. ఇప్పటికే జిల్లాల వారీగా ఖాళీల వివరాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. గ్రామాల్లో 50 కుటుంబాలకు చొప్పున 1,94,592 మంది వాలంటీర్ల నియామకాలు చేపట్టింది. వారిలో 1,84,944 మంది విధుల్లో చేరారు.


మిగతా ఖాళీల భర్తీ కోసం నెలాఖరులోగా ప్రకటన జారీ చేయాలని భావిస్తోంది. మొత్తం మీద ఈ ప్రక్రియను డిసెంబర్ లోగా పూర్తి చేయాలని జగన్ సర్కారు భావిస్తోంది. ఈ గ్రామవాలంటీర్ల వ్యవస్థపై ఇప్పటికే పలు విమర్శలు వచ్చాయి. ఇవి కేవలం వైసీపీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారని టీడీపీ నేతలు చాలాసార్లు ఆరోపించారు.


మూటలు మోయడం కూడా ఓ ఉద్యోగమేనా అంటూ చంద్రబాబు ఈ పోస్టులపై విమర్శలు గుప్పించారు అంతే కాదు.. వాలంటీర్లు వేళ కాని వేళల్లో మొగుళ్లు ఇళ్లలో లేని సమయాల్లో వెళ్లి మహిళలను ఇబ్బంది పెడుతున్నారని కూడా చంద్రబాబు అన్నారు. అయితే ఎన్ని విమర్శలు ఉన్నా ఈ పోస్టులకు కూడా డిమాండ్ ఉంది. రూ. 5000 జీతం ఉన్న ఈ ఉద్యోగాల వేతనం కూడా పెంచాలని ప్రభుత్వం భావిస్తోందని వార్తలు వచ్చాయి. 8000 రూపాయలు చేస్తారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: