సినిమా రంగంలో రాణించిన బాలకృష్ణ, సినిమాలతో పాటు తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సి వచ్చింది.  తండ్రి స్థాపించిన పార్టీలో ఎన్టీఆర్ ఉండగా ఒక్కసారిగా పోటీ చేయలేదు.  పార్టీ తరపున ప్రచారం చేయలేదు.  ఆ తరువాత పార్టీ చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వెళ్ళిపోయింది.  బాబు 2014లో అధికారంలోకి వచ్చారు.  ఆ సమయంలో హిందూపురం నియోజక వర్గం నుంచి బాలయ్య పోటీ చేశారు.  


1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి హిందూపురం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారిపోయింది.  అనంతపురం జిల్లాలో పార్టీ ఎక్కడ గెలిచినా గెలవకున్నా, హిందూపురంలో మాత్రం తప్పకుండా విజయం సాధిస్తుంది.  ఇది ఆనవాయితీగా వస్తున్నది.  2014 ఎన్నికల్లో బాలయ్య విజయం సాధించిన తరువాత ఆ నియోజక వర్గంలో బాలయ్య పర్యటించింది చాలా కొద్దిసార్లు మాత్రమే.  తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి సరిపోయింది.  


2019 లో అలా కాదు, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.  రాయలసీమలో కర్నూలు, కడప జిల్లాలో పార్టీ క్లీన్ స్వీప్ చేసింది.  చిత్తూరులో ఒకటి, అనంతపురంలో రెండు సీట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది.  చిత్తూరులో బాబు గెలిస్తే, అనంతపురం జిల్లాలోని ఉరవకొండ, హిందూపురం నియోజక వర్గాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది.  


వైకాపా ప్రభంజనాన్ని తట్టుకొని హిందూపురంలో బాలకృష్ణ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి ఇక్బాల్ అహ్మద్ ఖాన్ పై 16000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.  కాగా, గెలిచిన తరువాత బాలకృష్ణ ఆ నియోజక వర్గంలో ఉన్నది కొన్ని రోజులే.  ఇప్పుడు తన సినిమాలపైనే పూర్తిగా దృష్టి పెట్టారు.  సినిమాల్లో బిజీగా ఉండటంతో హిందూపురం వెళ్లలేకపోయారు.  బాలయ్యపై పోటీ చేసి ఓడిపోయిన ఇక్బాల్ కు ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు.  ప్రస్తుతం ఇక్బాల్ హిందూపురంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.  వచ్చే ఎన్నికల నాటికి బాలయ్యకు చెక్ పెట్టాలని, హిందూపురం నియోజక వర్గాన్ని కైవసం చేసుకోవాలని వైకాపా ప్లాన్ చేస్తున్నది.  ఇక్బాల్ ద్వారా నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయడం మొదలు పెట్టారు.  ఇదే జరిగితే బాలయ్య సీటుకు ఎసరు పడినట్టే.  


మరింత సమాచారం తెలుసుకోండి: