రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ కృష్ణా, గోదావరి జలాల మధ్య ఏవైనా వివాదాలు తలెత్తితే ఆ వివాదాలను పరిష్కరించడానికి కేంద్రం ప్రమేయం అవసరం లేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడే సమస్యలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని కేంద్ర జలశక్తి ఆధీనంలోని అపెక్స్ కౌన్సిల్ అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏవైనా జల వివాదాలు ఏర్పడితే ఆ వివాదాలను పరిష్కరించే బాధ్యత కేంద్ర జలశక్తి శాఖపై ఉంది. కేంద్రం అపెక్స్ కమిటీని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన నియమించింది. అపెక్స్ కౌన్సిల్ తొలి సమావేశం అప్పటి సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ లతో కేంద్ర జనవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన 2016 సంవత్సరంలో జరిగింది. 
 
ప్రస్తుతం కేంద్ర జలవనరుల శాఖ రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించటానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎజెండాలను స్పష్టం చేయాలని జలశక్తి శాఖ మంత్రి లేఖలు రాశారు. గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం అయిన సమయంలో జల వివాదాలను న్యాయస్థానాలు, కేంద్రాన్ని ఆశ్రయించకుండా సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని కేసీఆర్ జగన్ కు ప్రతిపాదించారు. 
 
ఏపీ ప్రభుత్వం లేఖకు ఇప్పటివరకు స్పందించలేదు. జగన్ నిర్ణయం మేరకు ఎజెండా రూపొందించాలని కేంద్ర జల వనరుల శాఖ భావిస్తోంది. సీఎం ఎజెండా వద్దని చెప్పిన పక్షంలో అదే విషయాన్ని ప్రభుత్వ నిర్ణయంగా కేంద్రానికి జలవనరుల శాఖ చెబుతుంది. కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇరు రాష్ట్రాలు సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుంటే మంచిదని పోలవరం సాగునీటిపై తెలంగాణ ప్రభుత్వం వేసిన వ్యాజ్యాన్ని కూడా ఉపసంహరించుకుంటామని చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: