పల్నాడులో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. టీడీపీ కార్యకర్తలను గ్రామాల్లో ఉండనివ్వడం లేదు. దాడులు చేస్తున్నారు.. అరాచకాలు సృష్టిస్తున్నారు. దారుణం.. అన్యాయం.. అంటూ ఇటీవల చంద్రబాబు చాలా రచ్చ చేశారు. చలో ఆత్మకూరు పేరుతో హడావిడి సృష్టించారు. అయితే అంత సీన్ లేదంటున్నారు అక్కడి పోలీసులు.


పల్నాడుతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై పోలీసులు వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల అదుపులో ఉన్నాయని శాంతిభద్రతల అదనపు డైరెక్టర్ జనరల్ రవిశంకర్ అయ్యన్నార్ స్పష్టం చేశారు. ఆందోళన చెందేంత పరిస్థితులు ఏమి లేవని ఆయన అన్నారు. పల్నాడు ప్రాంతంలో పరిస్థితి దిగజారిందని తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసిందని, పోలీసులపై కూడా ఆరోపణలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీనిపై పూర్తి స్థాయి లో విచారించి నివేదిక ఇవ్వాలని డిజిపి ఆదేశించినట్లు ఏడీజీ తెలిపారు. 8 హత్యలు జరిగినట్టు చేసిన ఆరోపణలు సరికాదన్నారు. అసలు వీటికి రాజకీయాలతో సంబంధం లేదన్నారు.


రౌడీ గ్రూపులు దాడులు చేసుకున్న ఘటనలో ఒకరు చనిపోయారని, ఇది కూడా ఎన్నికల ముందు జరిగిందని రవిశంకర్ అయ్యన్నార్ అన్నారు. 110 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయని చేసిన ఆరోపణలు వాస్తవం కాదన్నారు. ఇక మూడో ఆరోపణలో 38 ఫిర్యాదులు చేసినా కేసులు నమోదు కాలేదన్నారు. కానీ ఇది కూడా నిజం కాదన్నారు.


ఎన్నికల ముందు నమోదు అయిన 10 కేసుల్లో 70 మంది వైకాపా వాళ్లను, 41 మంది తెదేపా కు చెందిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఇవి కూడా అన్ని కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపువేనని అన్నారు. ఆత్మకూరు నుంచి 545 మంది గ్రామం విడిచి వెళ్లిపోయారని ఆరోపించారని అది కూడా నిజం కాదన్నారు. పనులు కోసం 345 మంది మాత్రమే బయటకు వెళ్లారన్నారు. అందులో 312 మంది కూడా వెనక్కు తిరిగి వచ్చారన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: