హరిద్వార్ లోని మాత్రి ఆశ్రమంలో గంగా కాలుష్యంపై జరిగిన మేధావులు, విద్యావేత్తలు, ఉద్యమకారుల సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. గంగా నది ప్రక్షాళణ కోసం ఆమరణ దీక్ష చేసి అసువులుబాసిన జి.డి అగర్వాల్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు పుణ్య దినాన్ని పాటించారు. భారతదేశంలోని నదులన్నింటికీ సమస్య వచ్చి పడిందని తెలుగు రాష్ట్రాల్లోనూ కృష్ణ, గోదావరి, తుంగభద్ర మొదలైన నదులన్నీ పూర్తిగా కలుషితమై పోతున్నాయని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.


ఏ అభివృద్ధి అయినా.. పర్యావరణ సమతుల్యతపై ఆధారపడే జరగాలని ఆకాంక్షించారు. పర్యావరణ సమతుల్యత కోసం కట్టుబడి ఉండాలని ప్రాథమిక దశలోనే తమ పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. దేశంలో సహజ వనరులు కలుషితమై, క్షీణించి పోతున్నాయని... ఫలితంగా ప్రధాన నగరాల్లో నీటి ఎద్దడి తీవ్రరూపం దాలుస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ నగరానికి వచ్చే పదేళ్లలో తాగు నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చబోతోందని.. అక్కడ నీటిబొట్టు లభ్యమయ్యే పరిస్థితి గణనీయంగా పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.


పరిశ్రమలు, గృహాల నుంచి వచ్చే వ్యర్థాలను నేరుగా నదుల్లో కలిపేస్తున్నారని, తద్వారా పర్యావరణ సమతుల్యతను గణనీయంగా నాశనం చేస్తున్నారని అన్నారు. భారతదేశం సాంస్కృతిక వారసత్వంతో ముడిపడి ఉందని, ఇక్కడి ప్రజలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారని చెప్పారు. ’’మనం ఏదైనా తప్పు చేస్తే అది మనపై ప్రభావం చూపుతుంది మన పిల్లలపైనా ప్రభావం చూపుతుంది. అందుకే మనం పశ్చిమ దేశాల్లో తరహాలో.. వనరులను ఇష్టారాజ్యంగా దోచుకోము. మనం ఏదైనా తప్పు చేస్తే.. అది మన దేశ సాంస్కృతి వైభవాన్ని ధ్వంసం చేయడమే అవుతుంది’’అని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.


దేశంలోని అన్ని నదులనూ పునరుజ్జీవింప చేస్తేనే ప్రజలను దాహార్తి నుంచి గట్టెక్కించ గలమన్నారు. దేశంలోని ఏ నది నీటినైనా మనం గంగ అనే పిలుస్తామని.. గంగానదికి అంతటి ప్రాధాన్యత ఉందని.. గంగను తల్లిగా గౌరవించే సంస్కృతి దేశం నలుమూలలా ఉందని అన్నారు. గంగ ఉత్తర భారతానికో.. పశ్చిమ, తూర్పు ప్రాంతాలకో చెందింది కాదని.. యావద్భారతదేశానికి చెందిందని పునరుద్ఘాటించారు. నదుల ప్రక్షాళన గంగానదితో మొదలు పెట్టి.. దేశంలోని ప్రతి నదికీ.. వాటి ఉపనదులకూ విస్తరించాలని సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: