ఆర్టీసీ కార్మికుల‌ స‌మ్మె విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న‌లు చేశారు. దానికి త‌గిన‌ట్లుగానే కార్యాచ‌ర‌ణ‌ను కొన‌సాగిస్తున్నారు. మూడు నాలుగు రోజుల్లోనే వందకు వంద శాతం ఆర్టీసీ బస్సులు నడుస్తాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.  ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో బస్సులను నడిపించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు మధ్య బస్సులు ఎక్కువ రాకపోకలు కొనసాగించేలా చర్యలు తీసుకోవాల‌ని ఆయ‌న అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు. ఆర్టీసీ యూనియ్లు ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా ప్రభుత్వం చలించదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.


ఉద్యమం పేరిట విధ్వంసం చేస్తే ఉపేక్షించాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్‌ తేల్చి చెప్పారు. ప్ర‌జలకు రవాణా సౌకర్యం కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందన్నారు. బస్సులను ఆపి, బస్టాండ్లు, బడ్ డిపోల వద్ద అరాచకం చేద్దామని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు.ప్రతీ ఆర్టీసీ డిపో, బస్టాండ్ల వద్ద పోలీసు బందోబస్తును పెంచండని సీఎం డీజీపీని ఆదేశించారు. మహిళా పోలీసులను కూడా బందోబస్తు కోసం వినియోగించండని సూచించారు.  ``గుండాగిరీ నడవదన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం కాస్త ఉదాసీనంగా ఉంది. ఇకపై కఠినంగా వ్యవహరిస్తుంది. బస్ స్టాండ్లు, బస్ డిపోల వద్ద ఎవరు బస్సులను ఆపినా, విధ్వంసం సృష్టించినా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది` అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిని, బస్సులను ఆపేవారిని, ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి, కేసులు పెట్టి, కోర్టుకు పంపాలన్నారు. 


మ‌రోవైపు, అప్పటి వరకు విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల సెలవులను ఈ నెల 19 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. సిలబస్ నష్టపోకుండా భవిష్యత్తులో రెండో శనివారం విద్యా సంస్థలు నడపాలని, అవసరమైతే ఇతర సెలవులను తగ్గించుకోవాలని సూచించారు.బస్ పాస్ విషయంలో ఒక్క విద్యార్థి కూడా బాధ పడొద్దన్నారు. బస్ పాసులున్న విద్యార్థులు యధావిధిగా తమ విద్యాసంస్థలకు వెళ్లవచ్చని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 21వ తేదీ నుంచి అన్ని బస్సులు అందుబాటులోకి వస్తాయని సీఎం ప్రకటించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: