ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా  పాఠశాలలకు దసరా సెలవులు పొడిగించడం సరికాదని  తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టిపిఏ ), తెలంగాణ ప్రయివేట్ పాఠశాల యజమానులు  సంఘం (ట్రెస్మా) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది . తక్షణమే సెలవులను ఉపసంహరించుకోవాలని టిపిఏ, ట్రెస్మా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. అసలే రాష్ట్రంలో పాఠశాలలకు సెలవులు ఎక్కువై చదువు తగ్గిపోతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో దసరా సెలవులు పన్నెండు రోజులే ఇవ్వగా ,  తెలంగాణలో ఈ నెల పదమూడు వరకు పదహారు రోజులు సెలవులు ఇచ్చారన్నారు .


 ఇప్పుడు పంతొమ్మిది వరకు పొడిగిస్తే మొత్తం 22 రోజులు ఇచ్చినట్లు అవుతుందని , దీనివల్ల విద్యార్థులు చదువులో వెనుకబడిపోయే ప్రమాదముందని తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .  ఇలాంటి ప్రభుత్వ బాధ్యతారహిత చర్యల వల్లనే విద్యారంగంలో రాష్ట్రం బాగా వెనకబడిందని టిపిఏ ప్రతినిధులు విరుచుకుపడుతున్నారు . ఇటీవల నీతి ఆయోగ్ ఇరవై పెద్ద రాష్ట్రాలకు ప్రకటించిన స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ లో తెలంగాణ రాష్ట్రం  అట్టడుగున 18 వ ర్యాంకులో ఉన్న విషయం  తెలిసిందేనని ఎద్దేవా చేస్తున్నారు . ఈ విధంగా సెలవులు పెంచితే విద్యారంగం మరింత దిగజారే దుస్థితి దాపురిస్తుందని అంటున్నారు . కాబట్టి కార్మికుల న్యాయమైన డిమాండ్లతో సమ్మెను పరిష్కరించి, సెలవులల పొడిగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు .


 ఈ నెల 14 సోమవారం నుండే పాఠశాలలను తిరిగి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని  తల్లిదండ్రుల ప్రతినిధులు కోరుతున్నారు . పాఠశాలలు , కాలేజీలకు సెలవుల పొడగింపు పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండం రాష్ట్ర ప్రభుత్వం ఆత్మ రక్షణ లో పడినట్లు కన్పిస్తోంది . తల్లితండ్రుల నుంచి వెల్లువెత్తుతోన్న డిమాండ్ కు ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతుందో చూడాలి మరి .


మరింత సమాచారం తెలుసుకోండి: