తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సెలవుల్ని ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. కానీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజలనుండి, టీచర్ల నుండి, పేరెంట్స్ నుండి, స్టూడెంట్స్ నుండి కూడా వ్యతిరేఖత వ్యక్తమవుతోంది. వివిధ సంఘాల నేతలు దసరా సెలవుల పొడిగింపుపై విమర్శలు చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మె చేస్తున్న కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించాలని చెబుతున్నారు. 
 
ప్రభుత్వం సెలవుల్ని పొడిగించటం వలన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ పిల్లలకు సెలవులు ఎక్కువైపోతున్నాయని పిల్లలకు సెలవులు ఎక్కువ కావటం వలన పిల్లల యొక్క చదువు తగ్గిపోతుందని చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం ముందుగానే 4 రోజులు సెలవులు ఎక్కువగా ఇచ్చిందని ఇప్పుడు మరో వారం రోజులు పొడిగించటం ఏమిటని పేరెంట్స్ అసోసియేషన్ ప్రశ్నిస్తోంది. 
 
సెలవుల్ని మరింతగా పెంచటం వలన విద్యారంగం దిగజారుతుందని ప్రభుత్వం 23 రోజులు సెలవులు ఇచ్చినట్లు అవుతుందని తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ చెబుతోంది. జాక్టో అనే టీచర్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం వారం రోజులపాటు సెలవులను పొడిగించటం ద్వారా సమ్మె ప్రభావం తీవ్రంగా ఉంటుందని ప్రభుత్వం ఒప్పుకున్నట్లుగా అర్థం చేసుకోవచ్చని చెప్పింది. 
 
బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్చుతరావు మాట్లాడుతూ పిల్లలను విద్యకు దూరం చేయటం విద్యాహక్కు ఉల్లంఘన అని విమర్శలు చేశారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతమవుతున్నట్లు తెలుస్తోంది. వ్యూహాత్మక కార్యాచరణతో సమ్మెను తీవ్రతరం చేయాలని ఆర్టీసీ కార్మికులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కార్మికుల డిమాండ్లకు రాజకీయ పార్టీలు సైతం మద్దతు అందిస్తున్నాయి. సీఎం కేసీఆర్ మాత్రం మూడు రోజుల్లో కొత్త బస్సులు నడపాలని కొత్త విధానం ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: