ఆర్టీసీ సమ్మె నేపధ్యం లో స్కూళ్లకు సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . కరీంనగర్ జిల్లా కు చెందిన రంజిత్ కుమార్  అనే సామాన్యుడు  నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి , ప్రభుత్వ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా, కేసీఆర్ అనుసరిస్తోన్న విధాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. సిఎంఓ సిబ్బందితో రంజిత్ ఫోన్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది . ఆర్టీసీ సమ్మె నేపధ్యం లో స్కూళ్లకు సెలవులను పొడగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన రంజిత్, ఆర్టీసీ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి ధోరణిని ఖండించారు.


 ముఖ్యమంత్రి అంటే కార్మికులకు , రాష్ట్ర ప్రజలకు  తండ్రిలాంటి వారని ఆయనే అహంకారపూరితంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు . సమ్మెకు వెళ్లిన ఆర్టీసీ  కార్మికులతో చర్చలు జరిపేది లేదని ముఖ్యమంత్రి స్థానం లో ఉన్న వ్యక్తి ప్రకటించడం ఎంతవరకు కరెక్టని నిలదీశారు. తండ్రి పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తారని , కానీ  ముఖ్యమంత్రి అనుసరిస్తోన్న వైఖరి వల్లే ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేశారని , దానికి కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు . ఇకనైనా ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించి, వారి సమస్యలను పరిష్కరించాలన్న రంజిత్ , ఆర్టీసీ కార్మికుల, ప్రభుత్వానికి మధ్య సామాన్యులు నలిగిపోయే పరిస్థితి  నెలకొందని వాపోయాడు .


 ప్రజలకు ఇబ్బంది కలగవద్దని పూర్తి స్థాయి లో బస్సులు నడపాలని  ముఖ్యమంత్రి , అధికారులను ఆదేశిస్తున్నప్పటికీ , పూర్తి స్థాయి లో బస్సులు నడవక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు . ఇప్పటికే 16 రోజులు స్కూళ్లకు సెలవులు ఇచ్చారని , ఈ నెల 19  వరకు పొడిగించడం ఏమిటని , దానివల్ల విద్యార్థుల చదువు దెబ్బతినదా? అంటూ రంజిత్ కుమార్ ప్రశ్నించారు . సిఎంఓ సిబ్బందిని ప్రశ్నించడమే కాకుండా , ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని కోరాడు . ప్రతి ఒక్కరి మదిలో ప్రభుత్వ నిర్ణయం పై ఉన్న అభ్యంతరాన్ని  రంజిత్ సామాన్యుల గళం పై విన్పించడం పట్ల సోషల్ మీడియా లో అతనికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి . 


మరింత సమాచారం తెలుసుకోండి: