హుజూర్ నగర్ ఉప ఎన్నిక  లో అధికార టీఆరెస్ కు మద్దతు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన 24 గంటల వ్యవధిలోనే సిపిఐ నాయకత్వం మాట మార్చింది  . హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార పార్టీకి మద్దతు ఇచ్చేది, లేనిది పార్టీ సమావేశం లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు . ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిని నిరసిస్తూ , హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార పార్టీ కి మద్దతు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన 24 గంటల వ్యవధిలోనే మాట మార్చడం వెనుక మర్మం ఏమిటన్నది అంతుచిక్కడం లేదు .


 ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల అధికార టీఆరెస్ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది . దానిలో భాగంగానే సమ్మె లో పాల్గొంటున్న కార్మికులను విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా, సమ్మె లో పాల్గొన్న వారికి గత నెల జీతాలు కూడా చెల్లించేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరాఖండిగా తేల్చి చెప్పారు . ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగులు మద్దతునిస్తారోనన్న అనుమానం తో వారిని ముందుగానే పిలిపించుకుని మాట్లాడి , కరువు భత్యాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారన్న విమర్శలు విన్పిస్తున్నాయి . ఆర్టీసీ కార్మికులను ఏకాకి చేసి , సమ్మె విచ్చిన్నం చేయాలని చూస్తున్న ప్రభుత్వానికి , విపక్షాలు మద్దతునివ్వడం ఏమాత్రం రుచించడం లేదు .


 అయితే ఆర్టీసీ కార్మికులు సమ్మె కు వెళ్లకముందే , హుజూర్ నగర్ ఉప ఎన్నిక లో టీఆరెస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్న సిపిఐ , మారిన రాజకీయ పరిణామాల నేపధ్యం లో మద్దతు ఉపసంహరించుకుంటుందని అందరూ భావించారు . అందరూ భావించినట్లుగానే మద్దతు ఉపసంహరించుకుంటున్నామని చెప్పిన సిపిఐ , ఇప్పుడు మాట మార్చడం పట్ల , ఆ పార్టీ నాయకత్వ విశ్వసనీయత పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి .


మరింత సమాచారం తెలుసుకోండి: