టీడీపీ నేతలు బీజేపీ లోకి వెళ్లకుండా నిలువరించేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొత్త ఎత్తుగడ వేస్తున్నారా? భవిష్యత్తు లో తిరిగి బీజేపీ తో పొత్తు ఉంటుందన్న సంకేతాలను పార్టీ క్యాడర్ , నేతలకు పంపుతున్నారా?? అంటే అవుననే రాజకీయ వర్గాల నుంచి  సమాధానం విన్పిస్తోంది . ఎన్నికల ముందు బీజేపీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం తో విభేదించడం వల్ల రాష్ట్రానికి మేలు జరగకపోగా,  రాజకీయంగా తాము  నష్టపోయామని తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే , అయన తన తప్పు తెలుసుకున్నారా?, లేకపోతే మళ్ళీ బీజేపీ తో జతకట్టే ప్రయత్నాలు చేస్తున్నారా ? అన్న అనుమానం కలుగుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు .


  అసెంబ్లీ , సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తో పొత్తు లేకపోవడం వల్లే తాము దారుణంగా దెబ్బతిన్నామని చంద్రబాబు భావిస్తున్నారేమోనని అంటున్నారు. అందుకే ఎన్నికల తరువాత అయన, బీజేపీ నాయకత్వం లోని  కేంద్రాన్ని విమర్శించకుండా మౌనం దాల్చుతున్నారని పేర్కొంటున్నారు . ఎన్నికల ముందు దేశం లోని విపక్షాలన్నింటినీ, బీజేపీ కి వ్యతిరేకంగా ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాన్ని చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు . అయితే అసెంబ్లీ , సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా దెబ్బతినడం , వైకాపా అనూహ్యంగా ఏకపక్ష విజయం సాధించడంతో చంద్రబాబు తీవ్ర అంతర్మథనం లో పడిపోయారన్నది నిర్వివాదాంశమని పేర్కొంటున్నారు . బీజేపీ తో సఖ్యతగా ఉండడం వల్లే వైకాపా ఏకపక్ష విజయం సాధించిందని భావిస్తోన్న చంద్రబాబు తిరిగి ఆ పార్టీ కి చేరువయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు . 


ఇటీవల టీడీపీ కి చెందిన పలువురు నేతలు బీజేపీ లో చేరడం , మరికొంతమంది బీజేపీ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తుండడం తో,  మళ్ళీ ఆ పార్టీ తో  పొత్తు ప్రయత్నాలు చేస్తున్నామన్న   సంకేతాల ద్వారా  పార్టీ వీడాలనుకుంటున్న వారిని కట్టడి చేయవచ్చునని భావిస్తే ... భావించి ఉండవచ్చునని అంటున్నారు . దానివల్ల పార్టీ వీడాలనుకునే వారు బీజేపీ లోకి వెళ్లినా, టీడీపీ లో కొనసాగిన ఒక్కటేనన్న భావనతో పార్టీ వీడే అవకాశాలు తక్కువగా ఉంటాయని బాబు అంచనా వేస్తున్నారేమోనని పేర్కొంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: