ఆర్టీసీ కార్మికులు గత తొమ్మిది రోజులుగా చేస్తున్న సమ్మె పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరికి   నిరసనగా శనివారం ఆత్మహత్యాయత్నం చేసిన ఖమ్మ డిపోకు చెందిన  డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ లోని  అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా  నేలకొండపల్లి మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన  శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం డిపో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు . ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్ తో ఆర్టీసీ కార్మికులు ఈ నెల ఐదవ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తున్న విషయం తెల్సిందే . అయితే ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె పట్ల ప్రభుత్వం కఠినవైఖరి అవలంభించడమే కాకుండా , కార్మికులను విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది .


దీనితో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీనివాస్ రెడ్డి    ఖమ్మంలోని తన ఇంటి వద్ద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు.  తీవ్ర గాయాలపాలైన ఆయన్ని కుటుంబ సభ్యులు  ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు . అయితే అప్పటికే పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం శనివారం సాయంత్రం హైదరాబాద్ కు తరలించారు. కంచన్ బాగ్ లోని డి ఆర్ డి ఓ అపోలో ఆసుపత్రిలో శ్రీనివాస్ రెడ్డి కి చికిత్స అందిస్తుండగా,  ఆదివారం ఉదయం మృతి చెందారు.  దీంతో ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శ్రీనివాస్ రెడ్డి  మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని  ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు.


 సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి,  సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం , ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం ఆస్పత్రికి చేరుకొని శ్రీనివాసరెడ్డిని పరామర్శించేందుకు ప్రయత్నించగా ,  అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలియడంతో వారు ఆందోళనకు దిగేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.  శ్రీనివాస్ రెడ్డి మృతితో సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్ కు అఖిలపక్షం పిలుపునిచ్చింది


మరింత సమాచారం తెలుసుకోండి: