ఎవరి మాటలు ఎలా ఉన్నా... బాల్య వివాహాలకు ఎవరూ అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. బేటీ పడావో బేటీ బచావో వంటి నినాదాలు చాలా చోట్ల అమలు కావడం లేదు. తెలంగాణలో ఏకంగా పావు వంతు అమ్మాయిలకు బాల్య వివాహాలు చేసేస్తున్నారు. 18 ఏళ్లు నిండక ముందే ఒక అయ్య చేతిలో పెట్టి చేతులు దులుపుకొంటున్నారు. ప్రభుత్వ గణాంకాలు చెబుతున్న వాస్తవాలేంటి..? బాల్య వివాహాలకు అసలు కారణాలేంటి..? సమాజంలో మార్పు రావడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుంది..? 


అన్ని రంగాల్లోనూ అమ్మాయిలు ముందుకు దూసుకెళ్తున్నా... ఆడపిల్ల అనగానే గుండెల మీది కుంపటి అన్న సంప్రదాయ ధోరణిలో మార్పు రావడంలేదు. ఉన్నత చదువులు చదివించి, ఉద్యోగం, ఆర్ధిక స్వాతంత్ర్యం వంటి ఊసెత్తకుండా పెళ్లి పేరుతో అమ్మాయి బాధ్యతను వేరే కుటుంబానికి బదిలీ చేస్తున్నారు. అందుకే.. తెలంగాణ రాష్ట్రంలో 26 శాతం మంది బాలికలు 18 ఏళ్లు నిండకుండానే అత్తారింట్లోకి అడుగు పెడుతున్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థలు బాల్య వివాహాలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నా.. ఇంత పెద్ద సంఖ్యలో రహస్యంగా పెళ్లిళ్లు జరుగుతున్నాయంటే... అమ్మాయిల పట్ల సమాజ దృక్పథం ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బంగారు తెలంగాణ కలలతో రాష్ట్రం అవిర్భవించినప్పటి నుంచి ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 3వేల 9వందల 57 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. విశ్వ నగరంగా చెప్పుకున్న ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే 175 బాల్య వివాహాలను అడ్డుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 


స్త్రీ, శిశు సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌ఆగష్టు మధ్య 366 బాల్య వివాహ కేసులు నమోదయ్యాయి. 2015లో ఒక వెయ్యి 102,  2016లో 778, 2017లో 662, 2018లో 720 కేసులు నమోదయ్యాయి. వీటన్నింటికీ తల్లిదండ్రుల పేదరికం ఒక కారణం కాగా, అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలు దాడులు మరో కారణం. జిల్లాల పరంగా గణాంకాలు చూస్తే ఖమ్మం జిల్లా 576 బాల్య వివాహ కేసులతో ముందు వరుసలో ఉంది. 365 కేసులతో సంగారెడ్డి జిల్లా రెండో స్థానంలోనూ, 307 కేసులతో మహబూబ్‌నగర్‌ మూడో స్థానంలో ఉంది. అతి తక్కువగా కరీంనగర్‌ జిల్లాలో 127 కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగానూ ఇదే ధోరణి కనిపిస్తోంది. 10 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సు బాలికలు దేశంలో 13 కోట్ల 27 లక్షలు ఉండగా, వీరిలో 2 శాతం మంది బాలికలు వివాహితులు. అంకెల్లో  చెప్పాలంటే 27లక్షల 42 వేల 714 మంది చిన్నారులు 14 ఏళ్ల లోపే పెళ్లి పీటలెక్కారు. పెళ్లైన చిన్నారుల్లో ఆడపిల్లల సంఖ్య ఆందోళనకరంగా ఉంది. 62 శాతం మంది ఆడపిల్లలు అంటే 17 లక్షల 9 వేల మంది అభం శుభం తెలియని వయస్సులోనే ఇల్లాలి బాధ్యత భుజాన వేసుకున్నారన్నమాట. అంటే ఇప్పటికీ బాలికలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది వారి కాళ్లమీద వారు నిలబడేలా చేయూత నివ్వాలని తల్లిదండ్రులు భావించడంలేదని స్పష్టమవుతోంది. 


బాల్య వివాహాలను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా లాభంలేకుండాపోతుంది. ప్రధాని మోడీ బేటీ బచావో, బేటీ పడావో నినాదామిచ్చినప్పటీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. మూఢ నమ్మకాలు, పేదరికం వంటి రుగ్మతలు తొలిగితే తప్పా సమాజంలో అమ్మాయిల పెళ్లిళ్ల విషయంలో మార్పు సాధ్యం కాదు. ఆ దిశగా ప్రభుత్వాలతో పాటు పౌరసమాజం కృషిచేయాల్సిన అవసరముంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: