వివాహేతర సంబంధం బెడిసికొట్టడంతో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ డబుల్ మర్డర్స్ సంచలనం సృష్టించాయి. వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు ఒకరిని చంపేశారు. ఈ  హత్యకు సాక్ష్యం చెబుతాడని మరొకరిని హత్య చేశారు.  గుంటూరు జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన కలకలం రేపింది.


వివాహేతర సంబంధం ఇద్దరు మిత్రుల దారుణ హత్యకు కారణమైంది. మూడు రోజుల కిందట కనిపించకుండాపోయిన వారు విగతజీవులుగా తేలడంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ జంట హత్యలు స్థానికంగా కలకలం రేపాయి. ఈ జంట హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. 


గుంటూరు జిల్లా కొల్లూరు మండలం అవులవారిపాలెంకు చెందిన కిషోర్ బాబు ఇటుక వ్యాపారం చేస్తుంటాడు. ఇతనికి వరుసకు మరదలు అయ్యే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. అదే కిషోర్‌బాబు ప్రాణాలు తీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఐతే...కిషోర్‌బాబు వెంట వెళ్లినందుకు మిత్రుడు నిరీక్షణరావు కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. హత్యకు సాక్ష్యం లేకుండా ఉండేందుకే వెంట వెళ్లిన నిరీక్షణరావును కూడా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 


కిషోర్‌బాబు.. ఈ నెల 10న మధ్యాహ్నం 3 గంటల సమయంలో రేపల్లె మండలం చవడయపాలెంలో ఇటుక తాలూకు డబ్బులు తెచ్చుకునేందుకు వెళ్లాడు. తన ఇంటికి దగ్గరలోనే ఉండే నిరీక్షణరావుని వెంటబెట్టుకెళ్లాడు. సాయంత్రం 6 గంటల సమయంలో నిరీక్షణ రావు భార్య తన భర్తకు ఫోన్ చేసింది. పెనుముడి వద్ద ఉన్నాం... వస్తాం అని నిరీక్షణరావు భార్యతో చెప్పాడు. ఆ తరువాత ఎంతసేపటికి రాలేదు. తర్వాత భార్య ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో చవడయాపాలెంలో ఉన్న కిషోర్ భార్య తరపు బంధువులకు ఫోన్ చేసింది. అయితే వారు రకరకాల సమాధానాలు ఇవ్వడంతో ఆమెకు అనుమానం వచ్చింది. 


వివాహేతర సంబంధమే... కిషోర్ బాబు, నిరీక్షణరావు హత్యకు కారణమై ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తు తర్వాత పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళతో సంబంధం కారణంగానే ఒకరిని రేపల్లె మండలం రాజు కాలువ వద్ద, మరొకరిని చవుడయాపాలెం వద్ద కృష్ణా నదిలో పడవేశారు. కిషోర్‌బాబు చవుడయాపాలెం వెళ్లిన తర్వాత ఏం జరిగింది, ఎవరు వీరిని హత్య చేశారో తేల్చేపనిలో పడ్డారు పోలీసులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: