ఈరోజు ఉదయం నుండి మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సిట్ అధికారులు నిందితులను గుర్తించారని ప్రొద్దుటూరుకు చెందిన సునీల్ గ్యాంగ్ సుఫారీ తీసుకొని వివేకానందరెడ్డిని హత్య చేశారని వార్తలు వినిపించాయి. ఈ విషయం గురించి ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ వివేకానంద రెడ్డి హత్య కేసులో వదంతులను నమ్మొద్దని చెప్పారు. ఎవరైనా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 
 
మీడియా ఇలాంటి కేసుల గురించి కథనాలను ప్రదర్శించే సమయంలో ఒకసారి పోలీసుల్ని సంప్రదించాలని చెప్పారు. వివేకా హత్య కేసులో ఇన్వెష్టిగేషన్ జరుగుతోందని విచారణను తప్పుదారి పట్టించవద్దని చెప్పారు. వివేకా హత్య కేసు చాలా సున్నితమైన అంశమని ఎవరైనా అసత్య ప్రచారం చేస్తే ఊరుకోమని చెప్పారు. వివేకా హత్య కేసులో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఒక హీరో హోండా బైక్ గుర్తించారని ఆ బైక్ గురించి ఎంక్వైరీ చేయగా ఆ బైక్ ప్రొద్దుటూరు సునీల్ గ్యాంగ్ కు చెందిన బైక్ గా గుర్తించినట్లు కథనాలు ప్రసారమయ్యాయి. 
 
కొన్ని రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాస్ రెడ్డికి ఈ ప్రొద్దుటూరు సునీల్ గ్యాంగ్ తో సంబంధాలు ఉన్నాయని బెంగళూరు నుండి సునీల్ గ్యాంగ్ కు డబ్బు అందిందనే కథనాలు వైరల్ అయ్యాయి. ఎస్పీ అన్బురాజన్ స్పష్టత ఇవ్వటంతో ఈ వార్తలు పుకార్లని తెలుస్తోంది. మార్చి 14వ తేదీన వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడు. వివేకానంద రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా పని చేశారు. 
 
వివేకానంద రెడ్డి హత్యకేసు రాష్ట్రంలో సంచలనం అయింది. హత్య జరిగి ఎనిమిది నెలలు అయినప్పటికీ హత్య చేసిన దోషుల వివరాలు మాత్రం వెలుగులోకి రావటం లేదు. ఈ కేసులో కొందరు అనుమానితుల్ని పోలీసులు అరెస్ట్ చేసినా విచారణలో పురోగతి లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: