అగ్ర‌రాజ్యం అమెరికా...ఆ దేశాన్ని ఢీకొట్టాల‌ని ఆరాట‌ప‌డుతున్న చైనా మ‌ధ్య వాణిజ్య యుద్ధం శుభం కార్డు దిశ‌గా సాగుతోంది. :ఏడాదికిపైగా కొనసాగిన అమెరికా-చైనా వాణిజ్య యుద్ధానికి తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. చైనాతో తొలి దశ ట్రేడ్ డీల్ కుదిరిందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. చైనా ఉప ప్రధాని లూ హీతో సమావేశం అనంతరం వైట్‌హౌజ్‌లో విలేకరులతో మాట్లాడుతూ మేధో సంపత్తి, ఆర్థిక సేవలపై ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఎంతో సమగ్రమైన ఈ సంధితో రైతులకూ గొప్ప లాభాలున్నాయన్న ఆయన 40-50 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయోత్పత్తులకు డిమాండ్ ఏర్పడిందని, రైతులు ఇందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ ప్ర‌క‌ట‌నతో ఒక ద‌శ‌లో వేగంగా ప‌డిపోయిన మ‌న రూపాయి కోలుకునే అవ‌కాశం ఉంది.


అమెరికాలోకి వస్తున్న చైనా దిగుమతుల్లో మరో 250 బిలియన్ డాలర్ల విలువైన వాటిపై సుంకాలను పెంచాలని ట్రంప్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ రెండు అగ్ర దేశాల మధ్య నెలకొన్న సుంకాల సమరం.. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లనేగాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థనూ దెబ్బ తీసింది. ఇలా అమెరికాతో వాణిజ్య యుద్ధం తీవ్రరూపం దాల్చిన‌ చైనా కరెన్సీ యువాన్ విలువ రికార్డు స్థాయిలకు పతనమయంది. దీని వెనుక చైనా ఉద్దేశ‌పూర్వ‌క చ‌ర్య‌లు ఉన్నాయ‌నే అంచ‌నాలు వెలువ‌డ్డాయి. అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధంతో భారత్‌కు ఇబ్బందేనని భార‌తీయ వ్యాపార‌వేత్త‌లు ఆందోళ‌న చెందారు. అంతర్జాతీయ మార్కెట్లో భగ్గుమంటున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం ఎగబాకుతుండటంతో కరెంట్ ఖాతా లోటు పెరుగతున్నదన్న భయాలు ఎక్కువయ్యాయి. ఇలా అమెరికా-చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధంపై చింతించాల్సిన ప‌రిస్థితులు తాజా ప‌రిణామంతో దూర‌మ‌య్యాయి.


అమెరికా నుంచి చైనా 17 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయోత్పత్తులనే కొనుగోలు చేస్తున్నదని, ఈ ఒప్పందం నేపథ్యంలో 40-50 బిలియన్ డాలర్ల కొనుగోళ్లకు మార్గం సుగమమైందన్నారు. కాబట్టి రైతులు మరింత వ్యవసాయ భూమిని సమీకరించుకోవాలని, భారీ ట్రాక్టర్లను వినియోగించాలని సూచించారు.తాజా డీల్‌తో ఈ నెల చైనాపై ట్రంప్ విధిస్తామన్న సుంకాలు వాయిదా పడనున్నాయి.తొలి దశ డీల్ పూర్తయిన వెంటనే రెండో దశ డీల్‌కు వెళ్తామని అమెరికా ఆర్థిక మంత్రి స్టీవెన్ మ్నూచిన్ తెలిపారు.  మరోవైపు ఈ డీల్‌తో న్యూయార్క్ స్టాక్ మార్కెట్ కూడా లాభాల్లో పరుగులు తీస్తున్నది. ఇదిలావుంటే రెండో దశ వాణిజ్య ఒప్పందంలో చైనా టెక్నాలజీ దిగ్గజం హువావీపై నిషేధం అంశం ప్రస్తావనకు వచ్చే వీలుందని ట్రంప్ సర్కారు సంకేతాలిస్తున్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: