ఎన్నికలు ఫలితాలు వచ్చి ఐదు నెలలు అవుతుంది. ఊహించాన్ని విధంగా 151 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలనలో దూసుకుపోతుండగా....ఘోరంగా ఓడిపోయిన టీడీపీ కోలుకోడానికి ప్రయత్నిస్తుంది. ఓ వైపు సరికొత్త నిర్ణయాలు, అద్బుతమైన పథకాలని ప్రవేశ పెడుతూ...జగన్ దూసుకుపోతున్నారు. మరోవైపు నేతల వలసలతో టీడీపీ కష్టాల్లో చిక్కుకుంది. ఇటు అనుభవం లేకపోయిన మంచి పాలన అందించడమే లక్ష్యంగా సీఎం జగన్ పని చేస్తున్నారు.  అటు అనుభవం ఉన్న చంద్రబాబు పార్టీని బలోపేతం చేయడానికి నానా కష్టాలు పడుతున్నారు.


అయితే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైన పార్టీని నిలబెట్టేందుకు చంద్రబాబు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లాల వారీగా నేతలతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ బలపడే అవకాశం ఉందనుకునే ప్రతి చోటల్లా సీఎం జగన్ సరికొత్త వ్యూహాలు రచించుకుంటూ వెళుతున్నారు. అందులో భాగంగానే టీడీపీని దెబ్బ తీయడానికి ఒక్కో జిల్లాలో ఒకో ప్రభుత్వ పథకాన్ని ప్రారంభించి అక్కడి ప్రజల దృష్టిని తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.


ఇటీవల జగన్ ఒక్కో జిల్లాలో ఒక్కో పథకాన్ని మొదలుపెట్టారు. ప్రభుత్వం రేషన్‌కార్డు లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలన్న నిర్ణయాన్ని సెప్టెంబరు నెలలో శ్రీకాకుళం జిల్లాలో అమలు చేశారు. కొత్తగా గ్రామ సచివాలయ ఉద్యోగాలు సాధించిన ఉద్యోగులకు నియామక పత్రాలని కృష్ణా జిల్లా విజయవాడలో ఇచ్చారు. ఆ తర్వాత జగన్ గ్రామ సచివాలయాలను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కరపలో ప్రారంభించారు. అలాగే అక్టోబర్ 4వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వైఎస్ఆర్ వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించారు.


సొంత ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ.10వేలు సాయం చేయడం ఈ పథకం యొక్క ఉద్దేశం. అలాగే రాష్ట్రంలో అంథత్వాన్ని నిరోధించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన వైఎస్సార్ కంటివెలుగు పథకాన్ని రాయలసీమలోని అనంతపురం జిల్లాలో ప్రారంభించారు. ఇక అక్టోబర్ 15న వైఎస్సార్ రైతు భరోసాని నెల్లూరు జిల్లాలో ప్రారంభిస్తున్నారు. త్వరలోనే మరో పథకాన్ని విశాఖపట్నం జిల్లాలో మొదలుపెడతారని తెలుస్తోంది. మొత్తానికి ప్రతి జిల్లాలో ఒక్కో పథకాన్ని మొదలుపెట్టి పార్టీని బలోపేతం చేస్తూ...టీడీపీని దెబ్బతీయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: