తొలిసారి అధికారం దక్కించుకుని మంచి జోష్ మీదున్న వైసీపీ...ప్రస్తుతం నేతలతో హౌస్ ఫుల్ అయిపోయిన విషయం తెలిసిందే. అసలు ఆ పార్టీకి ఇతర పార్టీల నుంచి నేతలని తీసుకోవాల్సిన అవసరమే లేదనే చెప్పాలి. అందుకే సీఎం జగన్ కూడా వలసల విషయంలో కఠినంగా ఉన్నారు. అధికారం వచ్చిన దగ్గర నుంచి వలసలని ప్రోత్సహించలేదు. అలాగే పార్టీలోకి వచ్చే ఏ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అయిన పదవులకు రాజీనామా చేసే రావాలని రూల్ పెట్టారు. అందుకే టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరు పార్టీ జంప్ కొట్టలేకపోతున్నారు.


అయితే మొదట్లో ఇతర నేతలని కూడా పార్టీలోకి తీసుకొని జగన్..తాజాగా రూట్ మార్చినట్లు తెలుస్తోంది. వరుసగా టీడీపీ, జనసేనలకు చెందిన నేతలని పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇటీవలే టీడీపీకి చెందిన తోట త్రిమూర్తులు, వరుపుల రాజా, ఆడారి ఆనంద్ కుమార్ లాంటి నేతలు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. అటు జనసేన నుంచి ఆకుల సత్యనారాయణ వైసీపీలో చేరారు.


ఇక మరికొందరు నేతలు వైసీపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వారు పార్టీ జంప్ అయిపోవడం ఖాయం. ఇలా నేతలని పార్టీలో చేర్చుకోవడం వెనుక జగన్ వ్యూహం ఒకటి ఉందని తెలుస్తోంది. కేంద్రంలో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పరచిన దగ్గర నుంచి బీజీపీ ఏపీలో బలపడాలని చూస్తోంది. అందులో భాగంగానే టీడీపీ,జనసేనకి చెందిన నేతలని పార్టీలో చేర్చుకున్నారు. ఇంకా చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.


ఈ క్రమంలోనే ఏపీలో బీజేపీ బలపడితే ఇబ్బందులు తలెత్తే అవకాశముందని భావిస్తున్న జగన్ వలసలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో అధికార వైసీపీలో చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారు. వైసీపీలో చేరేందుకు నేతలు ఆసక్తి చూపడంతో ప్రస్తుతానికి బీజేపీలోకి వలసలు ఆగిపోయాయి. జగన్ ఇలా సైలెంట్ గా టార్గెట్ బీజేపీ వైపు ఫిక్స్ చేసి అదిరిపోయే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: