రాజ‌కీయ రాజ‌ధానిగా పేరున్న కృష్ణాజిల్లాలో అధికార‌ వైసీపీకి చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. పార్టీ విప‌క్షంలో ఉండ‌గా వారు దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎంతో ప్ర‌యాస‌ప‌డ్డారు. తీరా పార్టీ అధికారంలోకి వ‌చ్చాక ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయారు. దీంతో అస‌లు వారు పార్టీలోనే ఉన్నారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వారే.. తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగ‌డ్డ‌ ర‌క్ష‌ణ‌నిధి, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్ర‌తాప్ అప్పారావు. ఈ ఇద్ద‌రూ కూడా వైసీపీ అధినేత జ‌గ‌న్ అంటే ప్రాణం పెట్టేవారు.


పార్టీ కోసం ఎన్నో కేసులు కూడా ఎదుర్కొన్నారు. జ‌గ‌న్ ఎలాంటి పిలుపు ఇచ్చినా దూకుడుగా ఆయా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ముఖ్యంగా పార్టీని అధికారంలోకి తీసుకు వ‌చ్చేందుకు జ‌గ‌న్ చేసిన ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌లో ఈ ఇద్ద‌రూ కీల‌కంగా జిల్లాలో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ర‌క్ష‌ణనిధి కానీ, మేకా కానీ ఇద్ద‌రూ వివాద ర‌హితులుగా, నిజాయితీ ప‌రులుగా కూడా పేరు తెచ్చుకున్నారు. 2014లో చంద్ర‌బాబు అనుకూల ప‌వ‌నాలు వీచి, జిల్లా వ్యాప్తంగా టీడీపీకి సానుకూల ఓటు బ్యాంకు ఏర్ప‌డిన‌ప్పుడు కూడా వీరిద్ద‌రూ ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం ద‌క్కించుకుని వైసీపీ జెండా ఎగుర‌వేశారు.


పార్టీ కోసం ప్ర‌భుత్వంపై అనేక పోరాటాలు చేశారు. ఎస్సీల ప‌రిర‌క్షణ పేరుతో త‌న నియోజ‌క‌వ‌ర్గంలో చేప‌ట్టిన ఉద్య‌మాన్ని ర‌క్ష‌ణ‌నిధి.. రాష్ట్ర వ్యాప్తంగా పాకేలా చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ర‌క్ష‌ణ నిధికి చెక్ పెట్టేలా.. అప్ప‌టి అధికార పార్టీ టీడీపీ ఇక్క‌డ అనేక విన్యాసాలు చేసింది. అప్ప‌టి మంత్రి జ‌వ‌హ‌ర్‌ను రంగంలోకి దింపి పోటీ చేయించింది. అయినా కూడా ప్ర‌జ‌లు ర‌క్ష‌ణ‌నిధి వెంటే నిలిచారు. ఇక‌, మేకా ప్ర‌తాప్ అప్పారావు.. స్థానికంగా వైసీపీకి ఎదురైన అనేక అవాంత‌రాల‌ను ఎదిరించి పార్టీ కోసం రోడ్డెక్కి ఉద్య‌మాలు చేప‌ట్టారు. ఈయ‌న‌కు వైఎస్‌తో కూడా అనుబంధం ఉంది.


కాంగ్రెస్ హ‌యాంలో వైఎస్‌కు అనుచ‌రుడిగా పేరు తెచ్చుకున్నారు. త‌ర్వాత జ‌గ‌న్‌కు జై కొట్టారు. నూజివీడులో వైసీపీకి అనుకూల ఓటుబ్యాంకును సృష్టించారు. మ‌రి ఇంత‌లా పార్టీ కోసం, పార్టీ అధినేత కోసం కృషి చేసి, వ‌రుస విజ‌యాలు సాధించిన ఈ ఇద్ద‌రు నాయ‌కులు ఇప్పుడు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏ కార్య‌క్ర‌మానికీ రావ‌డం లేదు. దీనికి కార‌ణం ఏంటి? అనే చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. త‌మ‌ను అధినేత జ‌గ‌న్ ప‌ట్టించుకోలేద‌నే అసంతృప్తి వీరిలో ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. క‌నీసం నామినేటెడ్ ప‌ద‌వుల్లోనైనా వీరికి ప్రాధాన్యం ఇస్తే.. బాగుంటుంద‌నే సూచ‌న‌లు వ‌స్తున్నాయి. మ‌రి జ‌గ‌న్ ఆదిశ‌గా కృషి చేస్తారో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: