చంద్రబాబు ఇపుడు పూర్తిగా అసహనంతో ఉన్నారనిపిస్తోంది. ఆయన ఏం మాట్లాడుతున్నారో కూడా ఆలోచించడంలేంటున్నారు. లేకపోతే నాలుగు నెలల ముందు వరకూ ఆయన చేతిలో ఉన్న వ్యవస్థల మీద మాజీ కాగానే ఒక్కసారిగా విరుచుకుపడడం ఏంటి. తాను ముఖ్యమంత్రిగా ముమ్మారు పనిచేశానని, సీనియర్ని అని కూడా బాబు మరచిపోతున్నట్లుగానే ఉంది ఆయన చేసిన కామెంట్స్ చూస్తుంటే. అందుకే  బాబు ఇలా అడ్డంగా దొరికిపోతున్నారు.


దాంతో నలభయ్యేళ్ల ఇండస్ట్రీ కాస్తా పరువు పోగొట్టుకుంటున్నారు. డ్యామేజ్ కూడా అలా ఇలా జరగడంలేదు. రాజకీయ నాయకునిగా చంద్రబాబు జగన్ని ఎన్ని అయినా విమర్శలు చేయవచ్చు కానీ పోలీసుల మీద బాబు ఇపుడు విరుచుకుపడుతున్నారు. వారిని వైసీపీలోకి వెళ్ళిపొమ్మంటున్నారు. అధికార పార్టీకి పోలీసులు  దాసోహం అంటూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇదే బాబు అయిదేళ్ళ పాటు సీఎం గా ఉన్నారు. ఆనాడు పోలీసులు కూడా వీరేగా. మరి అపుడు లేని అనుమానాలు, ఆగ్రహాలు ఇపుడు రావడం అంటేనే ఆశ్చర్యంగా ఉంది. బాబు తన రాజ‌కీయ బాణాలను పోలీసుల మీద వదులుతూంటే అంతే వేగంగా అవి వెనక్కు వచ్చి గట్టిగానే తగులుకుంటున్నారు.


పోలీస్ ఉన్నతాధికారులు ప్రెస్ మీట్ పెట్టి మరీ బాబు కామెంట్స్ ని చీల్చిచెండాడుతున్నారు. మరో వైపు పోలీస్ అధికారుల సంఘం కూడా రంగంలోకి వచ్చేసింది. రాజకీయం కోసం బాబు దిగజారుతూ తమపైన ఆరోపణలు చేస్తున్నారని కూడా ఘాటుగా విమర్శలు చేశారు. చంద్రబాబు వంటి సీనియర్ నేత ఇలా కామెంట్స్ చేయడమేంటి అంటున్నారు కూడా. దీంతో డిఫెన్స్ లో పడిన టీడీపీ తమ పార్టీలో ఉన్న మాజీ పోలీస్ అధికార్ వర్ల రామయ్యని రంగంలోకి దింపింది. చంద్రబాబు అందరి పోలీస్ అధికారులను అనలేదు, కొంతమంది మాత్రం ఆలా ఉన్నారని మాత్రమే అన్నారని  కవరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.

అయినా పోలీసుల ఆవేశం తగ్గలేదు. మొత్తం పోలీస్ వ్యవస్థ మీదనే బాబు  నిందలు వేసి ఇపుడు ఇలా అంటున్నారని మండిపడుతున్నారు. దీని బట్టి చూస్తూంటే పోలీసుల జోరు ఆగేట్లు లేదు. విమర్శలు చేయాలన్న అతి ఉత్షాహంతో బాబు ఇలా దొరికిపోయారని తమ్ముళ్ళే అనుకుంటున్న పరిస్థితి ఉంది. మరి రేపు బాబు ఇంకే వ్యవస్థను దుమ్మెత్తిపోస్తారోనని కూడా తమ్ముళ్ళు  భయపడిపోతున్నారుట.



మరింత సమాచారం తెలుసుకోండి: