గాంధీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు ? ఈ మాట వినగానే ఉలిక్కి పడకండి. ఈ ప్రశ్న వేసిన వాడికి పిచ్చా అని అనుమానంగా చూడకండి. ఇకపోతే ఈ ప్రశ్నను మరోసారి తిరిగి చదవాల్సిన అవసరం లేదు. మీరు చదివింది కరెక్టే. అదేంటండి ప్రపంచం అంతా గాంధీజీనీ  హత్యచేసారంటే మీరు కరక్టే అంటున్నారని విస్తూపోకండి ఈ ప్రశ్న విద్యార్థుల ప్రశ్నాపత్రంలో ప్రత్యక్ష మయింది. ఇంతకు ఈ ప్రశ్నాపత్రం రూపొందించిన మహానుభావుడు ఎవరో తెలియదు. ఇక వివరాల్లోకి వెళితే.


గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీనగర్ లోని "సుఫలం శాల వికాస్ సంకుల్" పేరుతో నిర్వహిస్తున్న  9వతరగతి పాఠశాలలో ఇంటర్నల్ ఎగ్జామ్స్ లో ఈ ప్రశ్న ప్రత్యక్షమయింది. మరో ముఖ్య విషయం ఏంటంటే ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో ఈ పాఠశాల నడుస్తున్నా ప్రభుత్వం నుంచి నిధులు అందుతున్నాయట. ఈ ప్రశ్న ఒక్కటే కాదు.. పన్నెండో తరగతి విద్యార్థులు రాసిన పరీక్షలో..మీ ఏరియాలో మద్యం విక్రయాలను ఎలా పెంచాలో వివరిస్తూ జిల్లా పోలీసు అధికారికి లేఖ రాయండి" అనే మరో ప్రశ్నను సైతం సంధించారు మేధావులు..


ఇకపోతే కేవలం భారతీయులకే కాదు ప్రపంచంలో భారతదేశం గురించి ఏ మాత్రం అవగాహన ఉన్నవారికైనా పరిచయం అక్కర్లేని పేరు గాంధీ.  మనదేశంలోనయితే చిన్నప్పటినుండి గాంధీ మహాత్ముని చరిత్రను పాఠ్యాంశాలుగా చదువుకుంటూనే పెరిగాం.  అలాంటిది స్కూల్ కెళ్ళే పిల్లాడిని అడిగినా జాతిపిత మహాత్మా గాంధీని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడని చెబుతాడు. అలాంటి గాంధీ పుట్టిన రాష్ట్రంలో ఆయన చరిత్రను తప్పుదోవపట్టించేలా ప్రశ్న ఉండడం, ఆయన స్మృత్యర్థం మద్యనిషేధం పాటించే రాష్ట్రంలో మద్యం అమ్మకాలను ఎలా పెంచాలో వివరించమని అడగడం శోచనీయం.


ఈ విషయమై స్పందించిన అధికారులు విచారణ చేపట్టారు. ఇలాంటి ప్రశ్నలు అడగడం క్షమించరాని పొరపాటని, ఈ ప్రశ్నల పట్ల విద్యాశాఖ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని గాంధీనగర్ జిల్లా విద్యాశాఖాధికారి భరత్ వధేర్ మీడియాకు తెలిపారు. ఈ పరీక్ష పేపర్లను రూపొందించింది స్కూల్ యాజమాన్యం. దీనికి స్టేట్ బోర్డ్ డిపార్ట్‌మెంట్‌తో ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు..ఇదండీ మనస్కూళ్ల పరిస్దితి అని ఇప్పటికే  ఈ విషయం తెలిసిన నెటిజన్స్ విమర్శిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: