పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి రెండు రాష్ట్రాల సమస్యలపై తన స్పందన తెలుపుతూనే ఉన్నాడు. మరో అడుగు ముందుకేసి సమస్య తీవ్రతను బట్టి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలని సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మెలో ఖమ్మం డిపో బస్ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నంతో మరింత తీవ్రరూపం దాలుస్తోంది. దీనిపై పవన్ తనదైన శైలిలో స్పందించాడు.

 


పవన్ గతంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆర్టీసీ సమస్య పరిష్కారం కోసం ఆలోచించాలని కోరాడు. ఇప్పుడు సమస్యపై జనసేన తరపున లేఖాస్త్రాన్నే సంధించాడు. “ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నం తీవ్రంగా కలచివేస్తోంది. ఈ సంఘటన దురదృష్టకరం. శనివారం మధ్యాహ్నమే ఒంటిపై కిరోసిన్ పోసుకున్న ఆయన్ను ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని మాట్లాడివుంటే ఆయన ఇంటికెళ్లాక ఆత్మాహుతి అయ్యేవారు కాదు. భార్య, పిల్లల ఎదుటే ఆయన దహించుకుపోవడం కలచివేస్తోంది. ఎనభైశాతం కాలిన ఆయన.. ‘ఆర్టీసీ కార్మికులు ఏడ బాగున్నారు’ అనడంలో ఆయన ఆవేదన అర్ధమవుతోంది. కోరుకున్న తెలంగాణ సాధించాక కూడా ఇటువంటి బాధాకర సంఘటనలు జరగడం విచారకరం. వరంగల్ జిల్లా నరసన్నపేట డిపోలో రవి అనే కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడనే వార్త ఆందోళన కలిగిస్తోంది” అని పవన్ ఆ లేఖలో పేర్కొన్నారు.

 


ఇటువంటి పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. ఇటువంటి ఘటనలు జరక్కుండా, మరొక్క ప్రాణం పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఆర్టీసీ కార్మికుల్లో ధైర్యం నింపాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదే. తక్షణం కార్మిక సంఘాలను చర్చలకు పిలవాలి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్మికులు కూడా ఆత్మబలిదానాలకు పోవద్దని విజ్ఞప్తి చేశారు. మరి సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: