ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకు ఉధృతమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను నడుపుతున్నప్పటికీ ప్రయాణికులకు కష్టాలు మాత్రం తప్పటం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నారని కొన్ని రోజుల క్రితమే చేసిన ప్రకటన నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. శనివారం రోజున ఖమ్మం జిల్లాలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ లో నిన్న కన్నుమూశారు. 
 
నర్సంపేటలోని ఒక ఆర్టీసీ డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించగా పోలీసులు, కార్మికులు కాపాడారు. హైదరాబాద్ లోని ఒక కండక్టర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోవటంతో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. 
 
ఓయూ విద్యార్థులు ఈరోజు మంత్రుల కార్యాలయాల ముట్టడి, 16వ తేదీన భారీ ర్యాలీ, 19వ తేదీన విద్యాసంస్థల బంద్, 21వ తేదీన ప్రగతి భవన్ ముట్టడి చేస్తున్నట్లు విద్యార్థి నాయకులు చెబుతున్నారు. ఖమ్మంలో శ్రీనివాస్ రెడ్డి మరణంతో ఒక్క బస్సు కూడా తిరగలేదు. నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్గొండ ప్రాంతాలలోని ఆర్టీసీ అధికారులు, భద్రత సిబ్బంది సమ్మె చేస్తున్న కార్మికులకు వేతనాలు ఇచ్చేవరకు జీతాలు తీసుకోవద్దని నిర్ణయం తీసుకున్నారు. 
 
ఆర్టీసీ కార్మికులు, విపక్ష నేతలు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వం చేసిన హత్యలేనని ఆరోపణలు చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి మరణానికి నైతిక బాధ్యత వహించి కేసీఆర్ రాజీనామా చేయాలని తెలంగాణ ప్రజలు విపక్ష పాలనను వ్యతిరేఖిస్తున్నారని మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఏపీలో జేఏసీ నాయకులు అన్ని డిపోల వద్ద ధర్నాలు నిర్వహించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కార్మికుల నుండి, ప్రజల నుండి, విపక్ష నాయకుల నుండి వ్యతిరేఖత వస్తూ ఉండటం కేసీఆర్ కు భారీ షాక్ అని చెప్పవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: