తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సెలవులను 19వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్ బోర్డు, విద్యాశాఖ సెలవులు పొడిగించని పాఠశాలల, కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటన చేసింది. కానీ హైదరాబాద్ నగరంలోని పాఠశాలల యాజమాన్యాలు, కార్పొరేట్ కళాశాలలు ఈరోజు నుండి తరగతులు ప్రారంభం అవుతాయని విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపినట్లు తెలుస్తోంది. 
 
కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తామని ప్రకటన చేస్తూ ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. విద్యాశాఖ అధికారులు ఈ విషయం గురించి స్పష్టత ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. గురుకుల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ గురుకుల కళాశాలలకు సెలవుల పెంపు వర్తించదని చెబుతున్నారు. 
 
ఈరోజు నుండి గురుకుల కళాశాలల్లో తరగతులను నిర్వహిస్తామని విద్యార్థులు ఇప్పటికే వసతి గృహాలకు చేరుకున్నారని ప్రవీణ్ కుమార్ చెప్పారు. గురుకుల పాఠశాలలకు మాత్రం 19వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. గురుకుల కళాశాలలకు సెలవుల పొడిగింపు లేదని ఇప్పటికే 75 శాతం మంది విద్యార్థులు కళాశాలలకు చేరుకున్నట్లు ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. 
 
నిజానికి తెలంగాణ ప్రభుత్వం ముందుగా చెప్పిన ప్రకారం నిన్నటితోనే దసరా సెలవులు పూర్తి కావాల్సి ఉంది. కానీ బస్సులు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవటంతో ప్రభుత్వం సెలవులు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు సెలవుల పెంపు వలన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని సెలవులు పొడిగించకూడదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకు ఉధృతమవుతోంది. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉండటంతో విపక్షాలు, వివిధ సంఘాల నాయకులు, యూనివర్సిటీ విద్యార్థులు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: