తెలంగాణా ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా స్కూళ్లు, కాలేజీలకు ఈనెల 19 వరకూ సెలవలు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సెలవలపై ఇప్పుడు గందరగోళం నెలకొంది. అయితే కొన్ని పాఠశాలలు, కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యం రేపటి నుంచి తరగతులు యథాతథంగా ప్రారంభమవుతాయని విద్యార్థుల తల్లిదండ్రులకు మెస్సేజులు పంపించాయి. దీంతో దసరా సెలవులపై గందర గోళం నెలకొంది.


అయితే సెలవలను ముందుగానే ఫిక్స్ అయిన తల్లిదండ్రులు వారిని పాఠశాలలకు పంపే ఏర్పాట్లు చేసుకోలేదు. ఇదే సమయంలో గురుకుల పాఠశాలలు, కళాశాలలకు సెలవుల పొడిగింపు వర్తించదని గురుకుల విద్యాలయాల కార్యదర్శి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మరింత గందరగోళం తలెత్తింది.


అయితే ఆ తర్వాత ప్రవీణ్ కుమార్ దీనిపై వివరణ ఇచ్చారు. గురుకుల పాఠశాల్లో విద్యార్థులు ఇప్పటికే 75 శాతం వచ్చేశారని ఆయన అన్నారు. అలా వచ్చిన వారిని వెనక్కు పంపబోమని ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారంపై దసరా సెలవులపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.


గురుకుల పాఠశాలలతో పాటు, ఇతర పాఠశాలలు, ఇంటర్‌ కాలేజీలకు దసరా సెలవులు 19 వరకు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఎవరైనా అతిక్రమించి పాఠశాలలను, కాలేజీలను తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. మరోవైపు ఈ సెలవులను పొడిగించినా ఆ తర్వాత పరిస్థితి ఏమిటన్నది అర్థం కాకుండా ఉందని వాపోతున్నారు.


ఓవైపు సమ్మె కొనసాగుతున్న కారణంగా తెలంగాణలోని చాలా ప్రైవేటు బస్సులను ఆర్టీసీకి మళ్లించారు. బస్సు డ్రైవర్లు ఆర్టీసీ కోసం పని చేస్తున్నారు. 19 తర్వాతైనా తెలంగాణలో పాఠశాలలు మొదలైతే.. ఈ బస్సు డ్రైవర్లంతా పాఠశాల బస్సులు నడపాల్సి ఉంటుంది. అప్పుడు ఆర్టీసీకి డ్రైవర్ల కొరత వస్తుంది. అసలు ఈ డ్రైవర్ల కోసమే పాఠశాలల సెలవుల గడువు పొడిగించారనే అనుమానమూ ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: