ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల అమలు కోసం చేపట్టిన సమ్మె ప్రారంభమై పదవ రోజుకు చేరింది. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో కార్మికులు బంద్ చేపట్టినట్లు సమాచారం అందుతోంది. కార్మికులు రోజురోజుకు సమ్మెను మరింత ఉధృతం చేస్తున్నారు. నిన్న ఆర్టీసీ కార్మికులు చాలా ప్రాంతాలలో వంటావార్పు కార్యక్రమం చేపట్టి నిరసన తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నట్లు ప్రకటించటంతో ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. 
 
ఆర్టీసీ కార్మికులు వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాల ద్వారా నిరసన తెలుపనున్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాలలో ఆర్టీసీ కార్మికులు బస్టాపుల వద్ద బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలలో బంద్ కొనసాగుతోంది. ఈ రెండు జిల్లాలలోని ప్రజలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేఖంగా మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాయి. 
 
ప్రభుత్వం ఆర్టీసీ విలీనం చేసే ఉద్దేశం లేదని చెబుతూ ఉండటంతో ఈ సమ్మెకు పరిష్కారం ఏమిటి అనే ప్రశ్న కూడా చర్చనీయం అవుతోంది. మరో వైపు ప్రభుత్వ వైఖరిపై ప్రజల్లో తీవ్రంగా వ్యతిరేఖత వ్యక్తమవుతోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలై పదిరోజులైనా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేఖత వ్యక్తమవుతోంది. 
 
పాఠశాలలకు, కళాశాలలకు వారం రోజులు సెలవులు పొడిగించటం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సెలవులు పొడిగించటం వలన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలనే అభిప్రాయం కూడా ప్రజల నుండి వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరిని మార్చుకొని నిర్ణయాలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: