కొన్నసార్లు జీవితంలో వింత ఘటనలు చోటు చేసుకుంటాయి. ఆ ఘటనల గురించి విన్నవారికి ఇలా కూడా జరుగుతుందా అనే సందేహాలు ఎదురవుతాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వైశాలి, హితేశ్ కుమార్ సిరోహి అనే దంపతులకు సంవత్సరం క్రితం వివాహమైంది. ఏడు నెలల గర్భిణి అయిన వైశాలికి కడుపులో నొప్పులు రావటంతో భర్త వైశాలిని హాస్పిటల్ కు తీసుకొనివెళ్లాడు. కొంత సమయం తరువాత వైశాలి ఒక పాపను ప్రసవించింది. 
 
కానీ పుట్టిన కొంత సమయం తరువాత పాప చనిపోయింది. పుట్టిన పాప చనిపోవటంతో వైశాలి, హితేశ్ ఇద్దరూ శోకసంద్రంలో మునిగిపోయారు. చనిపోయిన పాపను పూడ్చి పెట్టటం కొరకు మట్టిని తవ్విన హితేశ్ కు మూడు అడుగుల లోతులో ఒక మట్టికుండ కనిపించింది. ఆ మట్టి కుండ లోపల ఏముందో చూసిన హితేశ్ షాక్ అయ్యాడు. ఆ మట్టి కుండలో సజీవంగా ఉన్న ఒక పాప ఉంది. 
 
వెంటనే ఆ పాపకు పాలు పట్టించిన హితేశ్ దంపతులు సమీపంలోని ఒక హాస్పిటల్ లో పాపను జాయిన్ చేశారు. పాపను పూడ్చటం వలన పాపకు శ్వాస తీసుకోవటంలో సమస్యలు ఎదురైనట్లు తెలుస్తోంది. హాస్పిటల్ లొ చికిత్స అనంతరం దంపతులు పాప గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం పాపను వైశాలి, హితేష్ పెంచుకుంటున్నారు. 
 
మీడియాకు ఈ వివరాల్ని సీనియర్ పోలీస్ ఆఫీసర్ శైలేంద్ర పాండే తెలిపారు. పాపను సజీవంగా సమాధిలో పాతిపెట్టిన వారి గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సొంత బిడ్డ చనిపోయినప్పటికీ మరో పాప దొరకటంతో దంపతులు ఇద్దరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దంపతులు ఈ పాప తమ బాధను తగ్గించిందని చెబుతున్నారు. దేవుడు తమ బిడ్డ చనిపోయినా మరో బిడ్డ రూపంలో సహాయం చేస్తున్నాడనే అభిప్రాయాన్ని తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: