ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తోన్న సమ్మె నేపధ్యం లో రాష్ట్ర  ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు  ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం కావడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది . ఆర్టీసీ సమ్మెను విచ్చిన్నం చేసేందుకు ముఖ్యమంత్రి వేసిన ఎత్తుగడ లో ఉద్యోగ సంఘాల నేతలు కూడా పావులుగా మారారని పలువురు ఆరోపిస్తున్నారు . ఉద్యోగ సంఘాల నేతల తీరుపై రాజకీయ పార్టీలు , ప్రజాసంఘాల నేతలు చేస్తోన్న విమర్శల నేపధ్యం లో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమై తమపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు .


అయితే ఉద్యోగసంఘాల నేతలు తమపై వస్తున్న విమర్శలపై వివరణ ఇవ్వడం మానేసి రాజకీయ పార్టీలపై విమర్శలు చేయడం, కార్మిక సంఘాల జే ఏ సీ నేతలు సమ్మెకు వెళ్లేముందు తమకు  సమాచారం ఇవ్వలేదని ఎదురుదాడి చేసే ప్రయత్నం చేయడం చూస్తుంటే , వారిపై వస్తోన్న ఆరోపణలకు మరింత బలాన్ని చేకూర్చేలా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు . ఆర్టీసీ సమ్మె ను విచ్చిన్నం చేయడానికి  ముఖ్యమంత్రి వేసిన ఎత్తుగడ కు తాము కూడా పరోక్షంగా సహకరిస్తున్నామని చెప్పనే వారు చెప్పారని అంటున్నారు . ప్రభుత్వ ఉద్యోగులైనా, ప్రభుత్వ రంగ ఉద్యోగులైన సర్వీస్ రూల్స్ పెద్దగా తేడా ఉండవని , ఉంటే కొద్దిమేర మార్పులు ఉండవచ్చునని అంటున్నారు .


అదే సమయం లో తమ న్యాయమైన తమ   డిమాండ్ల కోసం  సహచర ఉద్యోగులు సమ్మె చేస్తోన్న తరుణం లో , ఏడాదిగా అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని సీఎం, ఉన్నట్టుండి పిలిపించుకుని మాట్లాడడం వెనుక ఆంతర్యమేమిటో విజ్ఞులైన ఉద్యోగ సంఘాల నేతలకు బోధపడలేదా అని ప్రశ్నిస్తున్నారు . సీఎం పిలిపిస్తే వెళ్ళొద్దా అంటున్న ఉద్యోగ సంఘాల నేతలు వెళ్లడాన్ని ఎవరు తప్పుపట్టకపోయినా...ఆ తరువాతే ఇంకా తాము చేసింది తప్పేమి కాదని , రాజకీయ సంఘాలు కార్మికుల భుజాన తుపాకీ పెట్టి కాల్చాలని చూస్తున్నాయంటూ , ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి వత్తాసు పలికే మాటలు మాట్లాడుతుండడమే వారి చిత్తశుద్ధిని శంకించేవిధంగా ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.


 ఏ రాజకీయ పార్టీ అయినా విపక్షం లో ఉంటే అదే పని చేస్తుందన్నది కొత్తగా చెప్పాల్సిందేమి లేదని , కార్మికులు కూడా ప్రభుత్వం పై వత్తిడి తెచ్చెదుకు ఆయా పార్టీల మద్దతు కోరుతున్నారన్నది ఉద్యోగ సంఘాల నేతలకు తెలియనిది కాదని , కాకపోతే తమపై వస్తున్న విమర్శల నేపధ్యం లో ఆత్మరక్షణలో పడిన వారు,  అనవసర ఆరోపణలతో అభాసుపాలవుతున్నారని అంటున్నారు .  


మరింత సమాచారం తెలుసుకోండి: