మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఇప్పటికైనా బయటకొస్తారా ? ఇపుడిదే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది. సోమ, మంగళవారాల్లో చంద్రబాబునాయుడు నెల్లూరు పర్యటనలో అయినా నారాయణ కనబడతారా ? అన్న విషయం ఆసక్తిగా మారింది. గడచిన ఐదేళ్ళ చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో నారాయణ ఓ రేంజిలో చక్రం తిప్పిన విషయం అందరూ చూసిందే.

 

ఎటువంటి రాజకీయ నేపధ్యం లేకపోయినా చంద్రబాబుతో  ఉన్న బంధం కారణంగా మాత్రమే నారాయణ ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరించారు. అలాంటి నారాయణ మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. సరే పార్టీనే ఓడిపోయినపుడు ఏదో అదృష్టం కొద్ది చక్రం తిప్పిన నారాయణ ఓడిపోవటంలో ఆశ్చర్యం ఏమీ లేదు లేండి. అలాంటి నారాయణ గడచిన నాలుగు నెలలుగా అసలు అడ్రస్సే లేకుండాపోయారు.

 

బిజెపిలో చేరటానికి ప్రయత్నిస్తున్నారని, వైసిపి నేతలతో రాయబారాలు పంపుతున్నారనే ప్రచారమైతే జరుగుతోంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, చంద్రబాబు బినామిగా ప్రచారంలో ఉన్న నారాయణ వైసిపిలో చేరుతారనే ప్రచారం జరుగుతుండటం కాస్త ఆశ్చర్యం కలిగించేదే.

 

సరే తనపై ఎటువంటి ప్రచారం జరుగుతున్నా మాజీ మంత్రి మాత్రం రాజకీయంగా ఎటువంటి యాక్టివిటి చేయటం లేదు. పైగా టిడిపి కార్యక్రమాల్లో కూడా ఎక్కడా కనబడటం లేదు. ఆయన విద్యాసంస్ధల్లో చాలా వరకూ ఎటువంటి అనుమతులు లేకుండానే నడుస్తున్నాయనే ఆరోపణలకైతే కొదవలేదు. అలాంటిది వైసిపి ప్రభుత్వం తన ఆదాయవనరుపై ఎక్కడ దెబ్బ కొడుతుందో అన్న భయంతోనే నారాయణ టిడిపికి దూరంగా ఉంటున్నట్లు ప్రచారంలో ఉంది.

 

దానికి తగ్గట్లే వైసిపి ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఓ నాలుగు సెంటర్లను మూసేయించారు. దాంతో మాజీ మంత్రిలో టెన్షన్ పెరిగిపోయింది. దాంతో జిల్లాపార్టీ నేతలతో కూడా టచ్ లో ఉన్నట్లు ఎక్కడా వార్తలు కూడా రావటం లేదు. ఈ నేపధ్యంలోనే రెండు రోజుల పర్యటన కోసం  చంద్రబాబు నెల్లూరుకు చేరుకున్నారు. మరి ఇపుడైనా చంద్రబాబు పర్యటనలో నారాయణ కనబడుతారా ? లేకపోతే దూరంగానే ఉండిపోతారా ? అన్నదే మిగిలిన నేతలను పట్టి పీడిస్తోంది. చూద్దాం నారాయణ ఏం చేస్తారో ?


మరింత సమాచారం తెలుసుకోండి: