ఆర్టీసీ సమ్మె కారణంగా... ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఈ నెల 19 వరకు సెలవులు పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం. ఐతే... కొన్ని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు మాత్రం ఇవాళ్టి నుంచే స్కూళ్లను తెరవబోతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలతో తమకు సంబంధం లేవంటున్నాయి.

స్వయంగా మంత్రి మల్లా రెడ్డి విద్యాసంస్థలే ఇవాళ తెరవబోతున్నారు. గురుకుల తరగతులు కూడా ప్రారంభించేది నేడే. దీనికి తోడు ప్రభుత్వం స్కూల్ బస్సుల్ని ప్రయాణికుల కోసం వాడుకుంటుండటం కూడా అటు స్కూళ్ల యాజమాన్యాలు, ఇటు పిల్లల తల్లిదండ్రుల్లో ఆగ్రహావేశాల్ని రగిలిస్తోంది. మొత్తంగా ప్రభుత్వ నిర్ణయం ప్రభుత్వానికే ఇబ్బందిగా మారుతోంది.ప్రైవేట్ స్కూళ్లలో ప్రతీ గంటా కీలకమే. అలాంటిది వారం పాటూ స్కూళ్లకు సెలవులు ఇస్తే... సిలబస్ ఎలా పూర్తవుతుందన్నది ఆ స్కూళ్ల యాజమాన్యాలు వేస్తున్న ప్రశ్న. ప్రభుత్వం మాత్రం ఇవేవీ ఆలోచించట్లేదు. ఓన్లీ సమ్మె దృష్టితో మాత్రమే చూస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం... నేటి నుంచే స్కూళ్లు తెరవాల్సి ఉంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉద్ధృతం చేయడంతో... ప్రభుత్వం కూడా సెలవులను పొడిగించింది. ఈనెల 19 వరకూ సెలవులు ఇచ్చింది.

20న ఆదివారం. 21న సోమవారం నాడు మళ్లీ స్కూళ్లు ఓపెన్ కానున్నాయి. ఇదే విషయాన్ని పిల్లల తల్లిదండ్రులకు ఫోన్ మెసేజ్‌ల ద్వారా చెప్పాయి. పిల్లల తల్లిదండ్రులు కూడా అందుకు ఓకే అంటున్నారు. తమ ఆదేశాల్ని అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పినా... కొన్ని ప్రైవేట్ స్కూళ్ల మేనేజ్‌మెంట్లు మాత్రం రూల్స్ బ్రేక్ చేస్తున్నాయి.


ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే... ప్రభుత్వమా, ప్రైవేట్ విద్యాలయాలా అన్నట్లు మారింది. ఎవరి మాట నెగ్గుతుందన్నది మరో కొత్త సమస్యగా తయారైంది. సెలవులు పొడిగించడం ఎవరికీ ఇష్టం లేకపోవడం వల్ల ప్రభుత్వమే తమ నిర్ణయాన్ని మార్చుకుంటుందా అన్నది ఇవాళ తేలనుంది. మరోవైపు కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి నడుపుతున్న విద్యాలయాలు కూడా నేడు తెరచుకోనున్నాయి. మరి ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తి రేపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: