ఆర్టీసీ కార్మికుల స‌మ్మె రోజురోజుకూ ఉధృతం అవుతోంది. ఇప్ప‌టికే ఇద్ద‌రు కార్మికులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ప్ర‌తిప‌క్షాల‌తోపాటు క్ర‌మంగా ప్ర‌జ‌ల మ‌ద్ద‌తును కూడా కూడ‌గ‌ట్ట‌డంలో కార్మిక నేత‌లు విజ‌యవంతం అవుతున్నారు. ప్ర‌భుత్వంపై, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై అటు సొంత పార్టీ నేత‌ల‌తోపాటు ప్ర‌జ‌ల్లోనూ క్ర‌మంగా వ్య‌తిరేక‌త పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఇంటెలిజెన్స్‌వ‌ర్గాలు ఇచ్చిన స‌మాచారంతో సీఎం కేసీఆర్ దిగొస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. మంత్రులు ఎర్ర‌బెల్లి, గంగుల క‌మ‌లాక‌ర్‌తో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడిపిస్తే.. అన్నివ‌ర్గాల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చిన విష‌యం తెలిసిందే.


ఈ మేర‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, టీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ నేత కే కేశ‌వ‌రావును రంగంలోకి దింపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేకే సోమ‌వారం ఓ ప్రెస్‌నోట్ విడుద‌ల చేశార‌ని గులాబీవ‌ర్గాల్లో గుస‌గుస‌లువినిపిస్తున్నాయి. అయితే..ఈ ప్రెస్‌నోట్లో కేకే ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌ను పొందుప‌ర్చారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయని... ఆత్మహత్య ఏ సమస్యకు కూడా పరిష్కారం చూపజాలదని ఆయ‌న పేర్కొన్నారు. పరిస్థితులు చేయిదాటక ముందే ఆర్టీసీ యూనియన్ నేతలు కార్మికులను సమ్మె విరమింపజేసి చర్చలకు సిద్ధం కావాలని ఆయ‌న‌ కోరారు.


గతంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా పరిష్కరించిందని.. 44 శాతం ఫిట్‌మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఆర్టీసీతో పాటు ఏ ప్రభుత్వరంగ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన లేదని ఆయ‌న గుర్తు చేశారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌భుత్వానికి కూడా ఆయ‌న ఓ సూచ‌న చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశం తప్ప కార్మికులు లేవనెత్తిన మిగతా డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని కేశవరావు విఙ్ఞప్తి చేశారు. అంటే.. ఆర్టీసీ కార్మికుల‌తో చర్చించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని చెప్ప‌డం కేకే ఉద్దేశ‌మ‌నే టాక్ వినిపిస్తోంది.


మొద‌ట మొండిత‌నంతో వ్య‌వ‌హ‌రించిన కేసీఆర్‌కు ఇప్పుడు స‌మ్మెను ఎలా ప‌రిష్క‌రించాలో తెలియ‌క స‌త‌మ‌తం అవుతున్నార‌ని, అందుకే కేకే రంగంలోకి దింపుతున్నారని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. కాగా తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందంటూ ఆవేదన చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైద‌రాబాద్‌లో మ‌రొక‌రు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: