దక్షిణాది రాష్ట్రాల్లో సంచలనంగా మారాడు లలితా జ్యువెలరీ చోరీ సూత్రధారి మురుగన్. బక్కపల్చని ఆకారం, అంద విహీనమైన ముఖం. ఇదీ అందరికీ గుర్తొచ్చే మురుగన్ రూపం. పోలీసులు కూడా ఇదే లెక్కలో ఆలోచించారు. కానీ లుక్ మారింది. పళ్లు, నవ్వు, ముఖం అన్నీ మారాయి. కట్టుడు పళ్లు వచ్చాయి.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. గతంతో పోల్చితే స్మార్ట్ గా తయారయ్యాడు. 


తిరుచ్చి జిల్లా తిరువెరుంబూర్ లో మురుగన్ అద్దెకు నివసించిన ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పోలీసులు తమ దగ్గర రికార్డుల్లో ఉన్న ఫోటో పట్టుకుని ఎంక్వైరీ చేశారు. ఈ వ్యక్తి మీకు తెలుసా? ఎప్పుడైనా చూశారా అని ఎవరిని అడిగినా సమాధానం లేదు. ఏ ఒక్కరూ గుర్తు పట్టలేదు ఫొటోలో ఉన్న వ్యక్తిని తామెప్పుడూ చూడలేదన్నారు. అద్దె ఇంట్లో ఉన్న వ్యక్తి ఇతడు ఒకరు కాదన్నారు. దీంతో పోలీసులు గందరగోళానికి గురయ్యారు. 


కానీ ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ తన దగ్గరున్న వార్తా సంచికలోని మురుగన్ పాత ఫొటో చూపించారు. అప్పుడు స్థానికులు అతడిని గుర్తించారు. అద్దె ఇంట్లో ఉన్నది అతనేనని తేల్చారు. అది మురుగన్ తొలినాళ్లలో ఆరోగ్యంగా ఉన్న ఫొటో. పోలీసుల వద్ద ఉన్న ఫొటో మురుగన్ అనారోగ్యానికి గురైనప్పటిది. ఇప్పుడు మురుగన్ ఆరోగ్యంగా హుషారుగా ఉన్నాడు. కట్టుడు పళ్లు వేయించుకున్నాడు. చిన్నపాటి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుని, తన లుక్ మార్చేశాడు. అందుకే ఎవరూ గుర్తుపట్టలేదని నిర్ధారించారు పోలీసులు.


ఇన్నేళ్లు దొంగతనాలు చేస్తున్న మురుగన్ ఎంత వెనకేసి ఉంటాడనే దానిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సుమారు 15 ఏళ్లుగా భారీ చోరీలకు పాల్పడుతున్నాడు.  దీంతో మురుగన్ ఇప్పటి వరకు రూ100 కోట్లు పైగా కొల్లగొట్టి ఉంటాడని, పోలీసులు భావిస్తున్నారు. ఇందులో చాలా భాగం సినిమాలు తీయటానికి ఖర్చు చేసినా బినామీ పేర్లతో ఆస్తులు దాచి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. టాలీవుడ్ లో పలు  చిన్న సినిమాలకు ఫైనాన్స్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 


చోరీ సొమ్ముతో విలాసవంతంగా బతికిన మురుగన్ ఇంతకాలం రెండు లగ్జరీ కార్లలో తిరిగాడని సమాచారం. అయితే ఇప్పుడా కార్లు ఏమయ్యాయో సమాచారం లేదు. దీంతో మురుగన్ కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులను ఇప్పటికే ప్రత్యేక బృందం విచారించింది. ఇప్పుడు మురుగన్‌ ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే పలు కేసుల చిక్కుముడులు వీడిపోతాయని పోలీసులు భావిస్తున్నారు.అదే సమయంలో మురుగన్ గతంలో సమయపురం పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ మొత్తంలో నగలు, నగదు చోరీ చేసిన  కేసూ ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. అయితే ఇక్కడ మరో వాదన కూడా ఉంది. మురుగన్  నుంచి నిజాలు రాబట్డం అంత తేలిక కాదనే వాదనలూ ఉన్నాయి. అతను చాలా మొండివాడని, కస్టడీలోకి తీసుకున్నా నిజాలు బయటకు తెలుసుకోవటం అంత ఈజీ కాదనే అభిప్రాయాలూ ఉన్నాయి. 2015లో బెంగళూరులోని ఓ పారిశ్రామికవేత్త నివాసంలో మురుగన్ అపహరించిన రూ.3.16 కోట్ల ఆభరణాలను స్వాధీనం చేసుకోవడానికి 90 రోజులు కస్టడీలోకి తీసుకోవాల్సి వచ్చింది. దీన్నిబట్టి చూస్తే, ఇప్పుడు 13 కోట్ల లలితా జ్యూయలరీ కేసు వివరాలు ఎప్పటికి తెలుస్తాయో అనే అనుమానాలూ ఉన్నాయి. 


అయితే తిరుచ్చి లలితా జ్యువెలరీ షోరూమ్ లో చోరీకి గురైన నగలలో ఐదు కిలోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా నగలు మురుగన్, సురేశ్‌ ల వద్ద ఉన్నాయనే విషయం తెలిసింది. వీరిలో సురేశ్ తిరువణ్ణామలై జిల్లా చెంగం కోర్టులో, మురుగన్ బెంగళూరు కోర్టులో లొంగిపోవడంతో వారిని రిమాండ్‌ కు తరలించారు. ఈ ఇద్దరిని కస్టడీలోకి తీసుకుంటే త్వరగా కేసు విచారణ పూర్తి చేయవచ్చని పోలీసులు భావిస్తున్నారు. రిమాండ్ ముగిసిన తర్వాత సురేశ్‌ ను సోమవారం తిరుచ్చి కోర్టులో హాజరుపరిచి కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: