సెలెబ్రెటీలనే తలదన్నే రేంజ్ లో ప్రధాని మోదీ సోషల్‌ మీడియాలో దూసుకెళుతున్నారు. ఇన్‌స్ట్రాగామ్‌లో ఆయనను ఫాలో అవుతున్న వారి సంఖ్య 3 కోట్లు దాటి ప్రపంచ స్థాయి నేతగా దూసుకుపోతున్న మోది.....సవాళ్ళు విసురుతూ ప్రతిపక్షాలకు ముచ్చమటలు పట్టిస్తున్నారు.జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని తిరిగి మరలా అమలు చేస్తామంటూ ప్రజలకు హామీ ఇవ్వగలరా అని ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ సవాల్‌ విసిరారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మొన్న ఆదివారం ప్రధాని మోదీ జల్‌గావ్‌లో మొదటిసారిగా  ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ‘జమ్మూకశ్మీర్‌ అంటే కేవలం చిన్న భూభాగం కాదు, దేశానికి అది మకుటం వంటిది. 40 ఏళ్లుగా అక్కడ నెలకొన్న పరిస్థితులను సాధారణ స్థాయికి తేవటానికి మాకు నాలుగు నెలలు కూడా పట్టలేదు  అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీలో ప్రసంగిస్తున్న  ప్రధాని మోదీ ప్రతిపక్షాలకు సవాల్‌ విసిరారు. ఎంతో కీలకమైన ఆర్టికల్‌ 370 రద్దును ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి.

పొరుగు దేశం అయినా పాకిస్థాన్ మాదిరిగానే మాట్లాడుతున్నాయి. కశ్మీర్‌పై దేశమంతటా ఏకాభిప్రాయంతో ఉండగా ప్రతిపక్ష నేతలు మాత్రం పూర్తి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. దమ్ముంటే ఆర్టికల్‌ 370, 35ఏ లను తిరిగి  మరలా అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టండి చూద్దాం’అంటూ  మోదీ సవాల్‌ విసిరారు. ప్రతిపక్ష నేతలు కశ్మీర్‌పై మొసలి కన్నీరు కార్చడం ఇకనైనా మానాలన్నారు. ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకించే ప్రతిపక్షాలకు భవిష్యత్తే ఉండబోదని హెచ్చరించారు.

జమ్మూ, కశ్మీర్, లఢాఖ్‌ల్లో నివసించే వాల్మీకి వర్గం వారికి కనీస హక్కులు కూడా కనుమరుగు అయ్యాయి. అందుకే ఎవ్వరూ ఊహించని విధంగా కశ్మీర్‌ స్వతంత్ర ప్రతిపత్తి రద్దు నిర్ణయం తీసుకున్నాం. 
మా ప్రభుత్వం చెప్పిందే చేస్తుంది’అని మోదీ అన్నారు. అలాగే, ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ట్రిపుల్‌ తలాక్‌ను శిక్షార్హం చేస్తూ తాము తెచ్చిన చట్టంపై కూడా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పారు. వీలైతే  ట్రిపుల్‌ తలాక్‌ విధానాన్ని తిరిగి ఆచరణలోకి తెస్తామని ప్రకటించాలని ప్రతిపక్షాలకు సవాల్‌ విసిరారాయన. ఈ సందర్భంగా ఫడ్నవిస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల విశ్వాసాన్ని పొందటాన్ని ఆయన ప్రశంసించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: