తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా తీసుకున్న అంశానికి ఆటంకాలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయ‌ని స‌ర్కారు స‌మ్మెపై ఉక్కుపాదం మోపుతున్న సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో....ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో బస్సులను నడిపించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండ‌గా...స‌హాయ నిరాకాణ‌ర ప‌రిస్థితి ఎదుర‌వుతోంది. క్షేత్రస్థాయిలో ఆర్టీసీ అధికారులు ప్ర‌భుత్వానికి సహకరించడం లేదని స‌మాచారం. ముఖ్యంగా డిపో మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు పరోక్షంగా సమ్మెకు మద్దతు తెలుపుతున్నార‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. దీంతో... రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సత్ఫలితాలు ఇవ్వ‌డం లేదు. 


ఆర్టీసీ స‌మ్మెపై ప్ర‌భుత్వం ర‌హ‌స్య నివేదిక తీసుకున్న‌ట్లు స‌మాచారం. ర‌వాణాశాఖ అధికారులు.. కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియాతో పాటు, ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మకు నివేదిక అందించారని తెలుస్తోంది. ఈ నివేదిక ప్ర‌కారం, మూడు రోజుల్లో వంద శాతం బస్సులు తిరుగాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ డిపో మేనేజర్లు, డీవీఎంలు సమ్మెకు అండగా నిలుస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని స‌ర్కారు భావిస్తోంది. కొంతమంది ఆర్‌ఎంలు కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తున్నారని టీఆర్ఎస్ వ‌ర్గాలు అంటున్నారు. బస్సుల కోసం డ్రైవర్లు గంటల కొద్దీ డిపోల వద్ద వేచిచూడాల్సిన పరిస్థితులను డీఎంలు కల్పిస్తున్నారు. ప్రతి డిపో దగ్గర ఇలాంటి పరిస్థితే ఉన్నట్లు సమాచారం. అధికారుల సహాయ సహకారాలతో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లపై సమ్మెలో ఉన్న కార్మికులు బెదిరింపులకు దిగుతున్నట్లు సమాచారం. దీంతో భయాందోళనలకు గురవుతున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరు కావటం లేదు. డ్రైవర్లను సమకూర్చడం తలకు మించిన భారంగా మారుతున్నదని రవాణాశాఖ అధికారులు, సిబ్బంది వాపోతున్నారు.


మ‌రోవైపు, ఊహించ‌ని ఇంకో ఇబ్బందిని స‌ర్కారు ఎదుర్కుంటోంది. అద్దె బస్సులు కూడా పూర్తిస్థాయిలో రోడ్డెక్కడం లేదని తెలుస్తోంది. ఇప్పటివరకు హైర్ బస్సుల య‌జ‌మానులు పెద్ద‌గా సహకరించిన దాఖ‌ల‌లాలు లేవంటున్నారు. దీనిపై కూడా  అధికారులతో ప్రభుత్వ పెద్ద‌లు  నివేదిక తెప్పించుకున్న‌ట్లు తెలిసింది. టెండరు ఖరారులో భాగంగా అద్దె బస్సులు తప్పనిసరిగా ప్రయాణ అవసరాలు తీర్చాల్చి ఉంటుందని, వాటిని ఉల్లంఘించిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చున‌ని ఈ నిబంధ‌న‌ల్లో ఉన్న‌ట్లు స‌మాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: