ఆర్టీసీ సమ్మె నేపధ్యం లో స్కూళ్లకు సెలవులు ప్రకటించడాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయులు  తీవ్రంగా తప్పుపడుతున్నారు . ఒక వైపు ప్రభుత్వ ఉపాధ్యాయులను దోషులుగా చిత్రీకరించే ప్రయత్నాన్నిచేస్తోన్న  ప్రభుత్వ పెద్దలు , మరొకవైపు ఇలా ఇష్టారీతి లో సెలవులు ప్రకటిస్తే , ఇక  తాము విద్యార్థులకు ఎలా చదువు చెప్పాలని ప్రశ్నిస్తున్నారు . దసరా పండుగ కోసం ఇప్పటికే 16  రోజులు సెలవులు ఇచ్చారని , ఇప్పుడు ఈ నెల  19  వరకు సెలవులు పొడిగించడం వల్ల తాము చెప్పిన చదువంతా  విద్యార్థులు   మర్చిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .


విద్యార్థులకు ప్రభుత్వ ఉపాద్యాయులు సక్రమంగా చదువు చెప్పడం లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తూనే , విద్యాసంస్థలకు ఇలా ఇష్టారీతి లో సెలవులు ప్రకటించడం ఏమిటనీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ప్రభుత్వం ఈ నెల 19  వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన , ప్రైవేట్ , కార్పొరేట్ విద్యాసంస్థలు మాత్రం క్లాస్ లను నిర్వహిస్తున్నాయని అంటున్నారు . ప్రభుత్వ నిర్ణయం వల్ల  ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద , బడుగు , బలహీన వర్గాల విద్యార్థులు మాత్రమే నష్టపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి కి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రభుత్వ అధికారులతో మాట్లాడిన ఫోన్ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది .


 ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే , విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడం ఏమిటో అంతుచిక్కడం లేదని అయన విస్మయం వ్యక్తం చేస్తున్నారు . రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు బస్సుల్లో ప్రయాణం చేసి , స్కూళ్లకు వెళ్ళేది ఉండదని , అయినా ప్రభుత్వం విద్యాసంస్థలకు  సెలవులు ప్రకటించడం   వెనుక   ఆంతర్యం ఏమిటో అంతుచిక్కడం లేదని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు అంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: