రాష్ట్రంలో ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను చూసి గులాబీ నేత‌లు ఆవేద‌న చెందుతున్నారా.. ఆర్టీసీ కార్మికుల స‌మ్మె అధికార టీఆర్ ఎస్ పార్టీలో చిచ్చుపెడుతోందా.. అంటే ఇటీవ‌ల పార్టీలో చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు అవున‌నే అంటున్నాయి. ఆర్టీసీ కార్మికుల విష‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యాన్ని టీ ఆర్ ఎస్‌లోని మెజార్టీ నేత‌లు అంత‌ర్గ‌త స‌మావేశాల్లో త‌ప్పుబ‌డుతున్న‌ట్లు స‌మాచారం. సార్ తొంద‌ర ప డ్డారు... పిలిచి మాట్లాడితే స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యేది.. అని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.


కార్మికుల‌పై సీఎం ఇలా ఎందుకు నిర్ణ‌యం తీసుకున్నారో అర్థం కావ‌డంలేద‌ని, ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌తో పార్టీకి చెడ్డ పేరు వ‌స్తోంద‌ని లోలోన మ‌ద‌న ప‌డుతున్నారు. ప్ర‌త్యేక రాష్ట్రం కోసం కార్మికుల‌తో క‌లిసి ఉద్య‌మించామ‌ని, ఇప్పుడు స‌మ్మెపై ఉక్కుపాదం మోప‌డం వ‌ల్ల పార్టీకి భ‌విష్య‌త్ లో న‌ష్టం త‌ప్ప‌ద‌ని ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు , సీనియ‌ర్ నేత‌లు లోలోప‌ల త‌మ ఆవేద‌న‌ను, ఆగ్ర‌హాన్ని వెల్ల‌గ‌క్కుతున్నార‌ట‌.


రెండోసారి మేం అధికారంలోకి వ‌చ్చాక అపోజిష‌న్‌కు అపోజిష‌న్‌కు ఇష్యూలు లేవు.. ఆర్టీసీ కార్మికుల స‌మ్మె విష‌యంలో మా సార్ తీసుకున్న నిర్ణ‌యం స‌రైందికాదు.. ఈ నిర్ణ‌యం ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షాల‌కు ఆయుధంగా మారింది.. అని ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ఓ సీనియ‌ర్‌నేత వ్యాఖ్యానించ‌డం పార్టీలోని అంత‌ర్గ‌త ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డుతోంది. ఇది నిరంకుశ వైఖ‌రి.. ప్ర‌జాస్వామ్యంలో ఎవ‌రైనా ఇట్లా చేస్తారా.. ఉమ్మ‌డి రాష్ట్రంలో కూడా ఇలాంటి ప‌రిస్థితిలేదు.  సార్ మొండి ప‌ట్టుద‌ల ఇవ్వాళ ఓ కార్మికుడి చావుకు కార‌ణ‌మైంది. సార్ తీరు చూస్తుంటే ప్ర‌భుత్వ ప‌త‌నానికి నాంది ప‌లికిన‌ట్లే ఉంది.. అని పార్టీలోని ఓ కీల‌క నేత పేర్కొన‌డం గ‌మ‌నార్హం.


అస‌లు ఈ స‌మ‌స్య‌కు ఎక్క‌డ, ఎలా ఫుల్‌స్టాప్ పెట్టాలో కూడా తెలియ‌డంలేద‌ని, సార్ మొండి వైఖ‌రి మూలంగా ప్ర‌జ‌ల్లో తాము అభాసుపాల‌వ‌తున్నామ‌ని, ప‌రిస్థితి ఇలానే కొన‌సాగితే మాత్రం పార్టీలోనే తిరుగుబాటు త‌ప్పేలా లేద‌ని టీఆర్ ఎస్ ముఖ్య నేత‌లు అభిప్రాయం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి ఆర్టీసీ స‌మ్మె అధికార టీఆర్ ఎస్‌లో చిచ్చుపెడుతోంద‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్తం అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: