బంగారు తెలంగాణా ఇప్పుడు బందుల తెలంగాణగా మారింది.తెలంగాణ రావడానికి అష్టకష్టాలు పడ్డ ప్రజలు, విద్యార్ధులు ఇప్పుడు కూడ అదేవిధంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో బలిదానాలు జరిగితే తప్ప ప్రత్యేక తెలంగాణ ఏర్పడలేదు. తెలంగాణ వస్తే కష్టాలకు పరిష్కారం లభిస్తుందని ఆశించిన ప్రజలు ఇప్పటికి కూడా తమకు న్యాయం జరగడం లేదని లోలో కుమిలిపోతున్నారట ? అప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో ఊపిరిలు ఆగిపోయాయి.ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ ప్రజా ఉద్యమంలో కూడా మరిన్ని ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి.


రోజు రోజుకు తెలంగాణలో సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. పదిరోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలోనే కొనసాగుతూ తమ ఆందోళనలనను, నిరసనలను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి సానుకూల స్పందనా రాలేదు. అంతేగాక, సమ్మె చేస్తున్న ఉద్యోగులను తొలగిస్తున్నామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన పలువురు కార్మికుల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఖమ్మంకు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లో సురేందర్ గౌడ్ అనే కండక్టర్ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలాడు. నర్సంపేటలో మరో డ్రైవర్ కూడా ఆత్మహత్యాత్నం చేశాడు. వివరాల్లోకి వెళ్లితే తాజాగా,


హైదరాబాద్ నగరంలో మరో కండక్టర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు..సోమవారం మధ్యాహ్నం హెచ్‌సీయూ డిపో ఎదుట ఆర్టీసీ బస్ కండక్టర్ సందీప్ బ్లేడుతో కోసుకున్నాడు. ఈ విషయం గమనించిన తోటి కార్మికులు వెంటనే అతడ్ని కొండాపూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. సందీప్ పరిస్థితి కాస్త విషమంగానే ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని మేధావులు, సామాజికవేత్తలు చెబుతున్నప్పటికీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం.


ఇకపోతే  తమ ఉద్యోగాలు పోతున్నాయనే బాధతో ఖమ్మంలో శ్రీనివాస్ రెడ్డి అనే డ్రైవర్ పెట్రోల్ సోసుకుని ఆత్మహత్య చేసుకోగా, హైదరాబాద్‌లోని కార్వాన్‌లో ఆర్టీసీ కండక్టర్ సురేందర్ గౌడ్ ఇంట్లో ఉరివేసుకుని  ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు సందీప్ బ్లేడుతో కోసుకున్నాడు. ఇలా ఇంకేంత మంది బంగారు  తెలంగాణాలో బలిపశువులుగా మారాలని ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వాన్ని పశ్నిస్తున్నారు. తెలంగాణ తెచ్చుకున్నది చావడానికా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: