ఒక వైపు రవాణ సౌకర్యాలు లేక ప్రజలకు ఇబ్బందులు. మరో వైపు ఊపందుకుంటున్న తెలంగాణ ఆర్టీసీ ఉద్యమంలో ఆగని ఆత్మ హత్యలు. ఈ పరిస్దితి ఇలానే కొనసాగితే తెలంగాణ పరిస్దితి ఏంటనేది ఇప్పుడున్న ప్రశ్న ? ఇప్పటికే దసరాకు నడవని బస్సులతో ఆర్టీసీకి వాటిల్లిన నష్టం లెక్కకట్టలేనిది. ఈ దశలో అప్పుల్లో వున్న తెలంగాణ, టెంపరరీ డ్రైవర్లకు, కండర్లకు అంతేసి డబ్బులు చెల్లించి అరకొర బస్సులు నడుపుతూ, రోడ్లను మృత్యు దారులుగా మారుస్తుంది. ఇప్పటికే రహదారుల్లో జరిగే ప్రమాదలను అరికట్టలేక సతమతమవుతున్న అధికారులకు, సరిగ్గా బస్సులు నడపడం రాని డ్రైవర్లతో పెద్ద తలనొప్పి తయారైందంటున్నారు.


ఇకపోతే ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మొండికేసి కూర్చున్నారు. అయితే అప్పుడప్పుడు మంత్రులు, గులాబీ పార్టీకి చెందిన ముఖ్యనేతలు మాత్రం మీడియా ముందుకొచ్చి.. ఆర్టీసీని ప్రైవేట్ చేసే ప్రసక్తే లేదని చెబుతున్నారు. అయితే తాజాగా.. టీఆర్‌ఎస్‌ ఎంపీ, పార్లమెంటరీ నేత కేశవరావు (కేకే) మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు నన్ను బాధించాయి. ఆత్మహత్య ఏ సమస్యకు కూడా పరిష్కారం చూపజాలదు. పరిస్థితులు చేయిదాటక ముందే ఆర్టీసీ యూనియన్ నేతలు కార్మికులను సమ్మె విరమింపజేసి చర్చలకు సిద్ధం కావాలి.


గతంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం  పరిష్కరించింది. 44 శాతం ఫిట్‌మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే. ఆర్టీసీతో పాటు ఏ ప్రభుత్వరంగ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొనలేదు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేయడమంటే మా విధానాన్ని మార్చుకోవాలని కోరడమే.. ఈ ఒక్కటి తప్ప ఆర్టీసీ కార్మికులు ఏమడిగినా చేయడానికి సర్కార్ సిద్ధంగా ఉంది. ఇది ఆర్టీసీ యూనియన్లకు సంబంధం లేని విషయం అని కేకే చెప్పుకొచ్చారు.


ఇకపోతే ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తేల్చి చెప్పడాన్ని తాను స్వాగతిస్తున్నానని.. ఇందుకు ఆయనను అభినందిస్తున్నాని కూడ పేర్కొన్నారు. ప్రస్తుత సమ్మె నేపథ్యంలో అద్దె బస్సులు, ప్రైవేట్ స్టేజీ క్యారేజీల విషయంలో కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని  ఇప్పుడున్న పరిస్దితికి అనుగుణంగా మాత్రమే చూడాలని విఙ్ఞప్తి చేశారు. అంతటితో ఆగని ఆయన.. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నాలు చేయవద్దని సూచించారు....


మరింత సమాచారం తెలుసుకోండి: