తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. సామాన్యుల‌కు షాకిచ్చేలా వ్య‌వ‌హ‌రించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో స్కూళ్లకు దసరా సెలవులు పొడిగించడంపై సీఎం కార్యాలయానికి సామాన్యుల నుంచి ఫోన్లు వెళ్లువెత్తుతున్న సంగ‌తి తెలిసిందే. కరీంనగర్ చెందిన రంజిత్ అనే వ్యక్తి కేసీఆర్ తండ్రిలా వ్యవహరించి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సిద్దిపేటకు చెందిన కరుణాకర్ (41) అనే మరో సామాన్యుడు ఫోన్ చేసి ‘తెలంగాణ బాపూజీగా నిలుస్తార‌ని పూజలు చేశాం.. ఇప్పుడు ఆయనే ఇలా చేస్తే ఎలా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కాల్ వైర‌ల్ అయిన నేప‌థ్యంలో...దీనిపై ముఖ్య‌మంత్రి కార్యాల‌య అధికారులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. 

ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి ఫోన్ చేసిన ఆ సామాన్యుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌క్కువ‌ జీతాలు ఉన్న‌ప్ప‌టికీ తాము పిల్లల్ని రూ.50 వేల ఫీజు కట్టి ప్రైవేటు స్కూల్ లో చదివిస్తున్నామని, ఇప్పుడు స్కూళ్లు బంద్ పెడితే ఎలా అని కరుణాకర్ ప్రశ్నించాడు. ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం ఏమైనా చేస్తుందా లేదా అని నిలదీశాడు. కేసీఆర్ అంటే తమకు ప్రాణమని, టీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి ఆయన వెనుకనే తిరిగామని, ఉద్యమంలో జైళ్లకు పోయామని కరుణాకర్ చెప్పాడు. తెలంగాణకు మరో బాపూజీ అవుతాడని పూజించిన వ్యక్తి.. ఇప్పుడు ఇలా ప్రజల చావులు, ఆత్మహత్యలకు కారణమైతే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన పెద్దన్నలా, తండ్రిలా వ్యవహరించి.. ఆర్టీసీ సమస్యను పరిష్కరించాలని కోరాడు. 


అయితే, తాజాగా ఈ ప‌రిణామంపై ముఖ్య‌మంత్రి కార్యాల‌యం ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ``తెలంగాణ సిఎం కార్యాలయం హెల్ప్ లైనుకు ఎవరో ఫోన్ చేసినట్లు, తమ అభిప్రాయాలు చెప్పినట్లు రెండు రోజులుగా పత్రికల్లో, ఛానళ్లలో తప్పుడు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇదే విధంగా దుష్ప్రచారం జరుగుతున్నది. సిఎం కార్యాలయ సిబ్బంది మాట్లడినట్లు ఎవరో ఫేక్ వాయిస్ సృష్టించారు. దీనికి బాధ్యులైన వారిపై చర్య తీసుకుని, తప్పుడు ప్రచారాన్ని ఆపాలని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.`` అని ఆ ప్ర‌క‌ట‌నలో స్ప‌ష్ట‌మైంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: