గత పదిరోజులుగా తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు.  కార్మికుల మెయిన్ మోటో ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి.  తమను ప్రభుత్వంలో విలీనం చేయాలనీ, అది తప్పించి మిగతా హామీలు తమకు పెద్దగా అవసరం లేదని కార్మికులు పట్టుబట్టిన సంగతి తెలిసిందే.  ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో.. సమ్మె చేస్తున్న వాళ్ళను ప్రభుత్వం విధుల నుంచి తొలగిస్తున్నట్టు చెప్పింది.  


అంతేకాదు, ఇకపై వాళ్ళతో ఎలాంటి చర్చలు ఉండబోవని స్పష్టం చేసింది.  కార్మికులు సైతం తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మెను విరమించేది లేదని చెప్తూ వస్తున్నది.  ఇదిలా ఉంటె, ఖమ్మం జిల్లాలో శ్రీనివాస్ అనే డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది.  ఖమ్మంలో బంద్ పాటించారు. దీంతో ప్రభుత్వం దిగి వచ్చే విధంగా కనిపిస్తోంది.  


కేకేను మధ్యవర్తిత్వంగా రంగంలోకి దించినట్టు తెలుస్తోంది.  కేకే ద్వారా ప్రభుత్వం రాయభారం పంపుతున్నది.  సమ్మె విరమించి చర్చలకు రావాలని కేకే కోరారు.  అయితే, తమ డిమాండ్లను ఆమోదించినపుడే చర్చలకు వస్తామని, అప్పటి వరకు చర్చలకు రాబోమని అంటున్నారు.  ప్రభుత్వం 44 శాతం ఇంక్రిమెంట్, 16శాతం వీఆర్ ఇచ్చారని కేకే అంటున్నారు.  ప్రభుత్వంలో విలీనం చేయడం తప్ప అన్ని డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తుందని కేకే అంటున్నాడు.  


కార్మికులు మాత్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని పట్టుబడుతున్నారు.  ప్రభుత్వంలో విలీనం చేస్తేనే భరోసా ఉంటుందని అంటున్నారు కార్మికులు.  అయితే, మధ్యేమార్గంగా చర్చలతో ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని ప్రభుత్వం చూస్తున్నది.  ఇప్పటికే పదిరోజులుగా బస్సులు సరిగ్గా నడవడం లేదు.  ఇంకొన్నాళ్ళు ఇలానే జరిగితే.. దానివలన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.   అందుకే ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టాలని ప్రభుత్వం చూస్తున్నది.  మరి ప్రభుత్వం కోరిక మన్నించి ఆర్టీసీ కార్మికులు చర్చలకు వస్తారా లేదంటే మెయిన్ డిమాండ్ నెరవేరే వరకు సమ్మె చేస్తారా చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: