ఆర్టీసీని  ప్రభుత్వంలో విలీనం చేయడంతోనే అమరుల ఆత్మకు శాంతి కలుగుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘ నాయకులు, తెలంగాణా రాష్ట్ర బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ అన్నారు. గత పదిరోజులుగా కొనసాగుతున్న సమ్మెతో ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయన్నారు. ఈ  సమ్మెతో ప్రభుత్వం సెప్టెంబర్ నెల జీతభత్యం విడుదల చేయలేదన్నారు. దీనితో  ఆర్ధిక ఇబ్బందులు తాళలేక  సురేందర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. ఆయన పార్థీవ దేహానికి దాసు సురేష్  కార్వాన్ లో ఉద్యమ నివాళులు అర్పించారు.  సురేందర్ గౌడ్ అంతిమ యాత్ర సందర్భంగా హైదరాబాద్ కార్వాన్ లోని సురేందర్ గౌడ్ ఇంటి నుండి నిర్వహించిన అంతిమయాత్రలో పలు కార్మిక సంఘాలు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకి వ్యతిరేకంగా నినాదాలతో ఎండకట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలన్నారు. 


ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు చట్ట ప్రకారం న్యాయమైనవన్నారు.  సున్నితమయిన ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సిన  అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ విషయంలో  ప్రభుత్వం భేషజాలకు పోవడం వల్ల అమూల్యమయిన కార్మికుల ప్రాణాలకు తీవ్రమయిన నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా  ముఖ్యమంత్రి కేసీఆర్ తన నిరంకుశ వైఖరి విడనాడాలన్నారు. కార్మికుల సమస్యల పరిష్కార దిశగా చొరవ చూపాలని దాసు సురేష్ డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి ఆత్మహత్య బాధిత కుటుంబాలకి కోటి రూపాయల పరిహారం , కుటుంబ సభ్యులు ఒకరికి  ప్రభుత్వ వుద్యోగం ఏర్పాటుచేసి సురేందర్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని దాసు సురేష్ ప్రభుత్వాన్ని కోరారు ఉద్యోగ సంఘాలన్నీ మానవతా దృక్పథంతో ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలని హితవు పలికారు.


ఎంజిఓ ,టిఎన్ జీవో  సంఘాలు ఆర్టీసీ కార్మికుల మనో దైర్యాన్ని దెబ్బతీయకుండా వ్యవహరించాలని కోరారు. పరస్పర సహకారాలతోనే ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేరే అవకాశం వున్నదన్నారు. తాత్కాలిక సర్దుబాట్లతో  ఉద్యోగుల మనుగడకే అనర్ధం పొంచివున్నదని ఉద్యోగులు గమనించాలని  సురేష్ అన్నారు.  ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య , ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ , మహిళా విద్యమకారులు సంధ్య , కమ్యూనిస్ట్ నాయకులు గోవర్ధన్ , ఆర్టీసీ జాక్ నాయకులు హనుమంతు ముదిరాజ్,తెలంగాణా సీనియర్ విద్యమకారులు గుండేటి శంకర్ , విద్యార్ధి రాష్ట్ర నాయకులు గజేందర్ తదితరులు పాల్గొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: