మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకుని చాలాకాలమే అయింది. ఆయన సినిమాలు చేసుకుంటున్నారు. అయితే ఇపుడు హఠాత్తుగా ఆయన మళ్ళీ పాలిటిక్స్ వైపు చూపు చూస్తున్నారు. జగన్ తో భేటీ కావడం అందులో భాగనేనని అంటున్నారు. నిజానికి చిరంజీవి అందరివాడుగా ఉండడానికి ఇష్టపడతారు. అయితే జగన్ తో భేటీ సందర్భంగా ఇపుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.


చిరంజీవి, జగన్ ఇద్దరు ఒకరి అవసరాలు మరొకరు కలిగి ఉన్నారని అంటున్నారు. ముందుగా చిరంజీవి విషయానికి వస్తే ఆయనకు ఏపీలో స్టూడియో కట్టాలని ఉందని అంటున్నారు. ఆయన తనయుడు రాం చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ స్థాపించి  వరసగా సినిమాలు తీస్తున్నారు. ఇక చిరంజీవికి ఎప్పటినుంచో స్టూడియో నిర్మించాలని కోరిక. అప్పట్లోనే విశాఖలో చిరంజీవి స్టూడియో కడతారని ప్రచారం జరిగింది. ఇపుడు సైరా సినిమా నేపధ్యంలో జగన్ని కలసిన మెగాస్టార్ ఏపీలో స్టూడియో నిర్మాణానికి తొందరలోనే సిధ్ధం అవుతారని అంటున్నారు.


ఇక జగన్ విషయానికి వస్తే ఇపుడున్న వారిలో చిరంజీవి టాలీవుడ్ పెద్ద. ఆయనంటే అందరికీ గౌరవమే. తాను సీఎం అయ్యాక ఇప్పటివరకూ టాలీవుడ్ నుంచి కనీసం అభినందన లేదని బాధపడుతున్న జగన్ కి ఇపుడు చిరంజీవి మంచి రిలీఫ్ ఇచ్చారు. స్వయంగా ఇంటికి వచ్చి అభినందించి విందారగించి వెళ్లారు. ఇది చాలు మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ అభినందించినట్లే అనుకోవాలి. ఇక చిరంజీవితో జగన్ బంధం ఇక్కడికి ఆగిపోదని కూడా అంటున్నారు. ఏపీలో సినిమా పరిశ్రమను అభివ్రుధ్ధి చేయాలని జగన్ అనుకుంటున్నారు. దానికి తగిన వ్యక్తి చిరంజీవి అని కూడా ఆయన భావిస్తున్నారు. చిరంజీవి ఒకే అంటే ఆయను ప్రభుత్వ నామినేటెడ్ పదవిలోనే నియమించి ఏపీలో టాలీవుడ్ అభివ్రుధ్ధికి చర్యలు చేపట్టాలని కోరుతార‌ని అంటున్నారు.


ఇక వచ్చే ఏడాది మార్చిలో రాజసభ సీట్లు పెద్ద ఎత్తున ఖాళీ కాబోతున్నాయి. అందులో అన్నింటినీ వైసీపీ గెలుచుకునే బలంతో ఉంది. చిరంజీవి ఓకే అంటే రాజ్యసభకు కూడా ఫిల్మ్ స్టార్స్ కోటాలో పంపాలని వైసీపీ భావిస్తోందని కూడా ప్రచారం సాగుతోంది. చిరంజీవి వల్ల కొన్ని జిల్లాల్లో బలమైన సామాజికవర్గం పూర్తిగా టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మొత్తం భేటీ ఎపిసోడ్ లో ఇద్దరికీ ప్రయోజనాలు ఉన్నాయి. మరి సైరా సినిమా చూడడంతోనే జగన్ చిరు బంధం ఆగదన్న మాట మాత్రం గట్టిగా వినిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: