ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రభుత్వ పనులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఎంతో ముఖ్యం అనుకుంటే తప్ప ఎవరికీ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వటం లేదు. సీఎం జగన్ ను చిరంజీవి కొన్ని రోజుల క్రితమే అపాయింట్ మెంట్ అడిగినప్పటికీ కొన్ని కారణాల వలన వీరిద్దరి మధ్య భేటీ జరగలేదు. కానీ ఈరోజు జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వటంతో ఇద్దరి భేటీ జరిగింది. 
 
జగన్ చిరంజీవి సమావేశం జరగటంతో ఇటు రాజకీయ వర్గాల్లో అటు సినీ వర్గాల్లో ఈ భేటీ గురించి ఆసక్తి నెలకొంది. వీరిద్దరి మధ్య రాజకీయపరమైన అంశాల గురించి ఎటువంటి చర్చ జరగలేదని కేవలం సైరా నరసింహారెడ్డి సినిమాకు సంబంధించిన చర్చ మాత్రమే జరిగినట్లు తెలుస్తోంది. సైరా నరసింహారెడ్డి సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వాలని చిరంజీవి కోరినట్లు జగన్ ఆలోచించి నిర్ణయం చెబుతానని చెప్పినట్లు తెలుస్తోంది. 
 
గతంలో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కొన్ని సినిమాలు వినోదపు పన్ను మినహాయింపు పొందాయి. సైరా నరసింహారెడ్డి తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కిన సినిమా. రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లాకు చెందిన యోధుని కథ కాబట్టి ఈ సినిమాకు పన్ను మినహాయింపు లభించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. 
 
సీఎం ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ పూర్తయిన తరువాత ఈ విషయం గురించి ఆలోచించే అవకాశం ఉంది. చిరంజీవి జగన్ ను సైరా నరసింహారెడ్డి సినిమా చూడమని కోరటంతో జగన్ తప్పకుండా చూస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వారం విజయవాడలోని పీవీర్ మాల్ లో వీలు చూసుకొని జగన్ సినిమా చూసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. జగన్ సినిమా చూసిన తరువాత ఏ విధంగా స్పందిస్తాడో కూడా చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: